
టీకాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
జనగామ రూరల్: టీకాతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు టీకాలు వేయించని పిల్లలకు, కొన్ని టీకాలు వేయించి మధ్యలో వదిలేసిన పిల్లలకు వేయించాలని కోరారు. మురికి వాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, సంచార జాతులు, కోళ్ల ఫారాలు, రైస్, జిన్నింగ్ మిల్లుల పరిసరాల్లో నివాసముండే కుటుంబాల పిల్లల్లో టీకాలు వేయించని వారికి సమీప పీహెచ్‌సీ, సబ్ సెంటర్లలో ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీతేజ, మౌనిక ప్రియదర్శిని, జయపాల్ రెడ్డి, సూపర్‌వైజర్‌లు ఉపేంద్ర, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు