జనగామ రూరల్/రఘునాథపల్లి: ఈనెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్లాట్లను క్రమబద్ధీకరించుకుని 25 శాతం రాయితీని పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వన్ బాషా అన్నారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం, రఘునాథపల్లి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ప్రతీ రోజు రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పన్నులు వసూలు చేయాలని, పన్ను ఎగవేతదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ –1864 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలో 113 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. సందేహాల నివృత్తికి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం నంబర్ 99481 87334, అలాగే.. జనగామ పురపాలక సహాయ కేంద్రం నంబర్ 8978 207205లో సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అదికారులు, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 96 మంది గైర్హాజరు
బుధవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 96 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,287 మంది విద్యార్థులకు గాను 4,191 మంది హాజరు కాగా.. 96 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,201 మందికి 3,155 హాజరు కాగా.. 46 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 1,086 మందికి 1,036 హాజరు కాగా.. 50 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరామ్, డీఐఈఓ జితేందర్‌రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
25 శాతం రాయితీని వినియోగించుకోవాలి
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా


