ఒక్క రోజులోనే మార్కెట్‌కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులోనే మార్కెట్‌కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం

Published Fri, Oct 13 2023 1:34 AM

- - Sakshi

జనగామ: వానాకాలం సీజన్‌లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్‌ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్‌ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో వానాకాలం సీజన్‌ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్‌లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్‌ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్‌ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్‌కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు.

రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్‌ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్‌లో టోకెన్‌ కేటాయించి గేట్‌ ఎంట్రీ వద్ద లాట్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్‌ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు.

43 లక్షల క్వింటాళ్ల ధాన్యం
వానాకాలం సీజన్‌లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్‌ రూ.2,203, సాధారణ గ్రేడ్‌కు రూ.2,183 ప్రకటించింది.

కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు
ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్‌లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్‌ ప్రైజ్‌ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది.

ధర తక్కువగా వచ్చింది
పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్‌కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు.  – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్‌(ఎర్రకుంటతండా)

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్‌కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.  – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్‌, నర్మెట

ధర పడిపోకుండా చూస్తున్నాం..
మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్‌ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం.  – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్‌ చైర్మన్‌

1/1

మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన ధాన్యం

Advertisement
 
Advertisement