వాత్సల్య వచ్చింది.. ఇక అనాథలకు, పేద చిన్నారులకు భరోసా వచ్చేసింది | Sakshi
Sakshi News home page

వాత్సల్య వచ్చింది.. ఇక అనాథలకు, పేద చిన్నారులకు భరోసా వచ్చేసింది

Published Tue, Apr 25 2023 1:34 AM

Vatsalya a new hope for poor and orphan children

దేవరుప్పుల : విధి వంచితులు, ఎటువంటి ఆదరణ లేని అభాగ్యుల పిల్లలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2009–10లో చైల్డ్‌ ప్రొటక్షన్‌ సర్వీస్‌ పేరుతో స్పాన్సర్‌ షిప్‌ పథకం తీసుకొచ్చింది.

2022 జూలై 5న ఈ పథకాన్ని మిషన్‌ వాత్సల్యగా మార్చి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. దేశంలో పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని, పుట్టిన ప్రతి బిడ్డ నిరాదరణకు గురికాకుండా జీవించాలనే గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పిల్లల విద్య, వైద్య, పోషణ అవసరాలకు ఆర్థిక చేయూత అందిస్తోంది.

పథకం గురించి..

తల్లి లేదా తండ్రి, ఇద్దరూ లేని ఒకటి నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు.. ఆర్థికంగా లేదా ఇతర అనగా పిల్లల వైద్య, అభివృద్ధి అవసరాలు తీర్చేందుకు కొంత సహాయం అందించడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం ‘మిషన్‌ వాత్సల్య’.

స్పాన్సర్‌షిప్‌ ద్వారా పిల్లలకు నెలకు రూ.4వేల స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఇందులో కేంద్రం 60 శాతం(రూ.2,400), రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం(రూ.1,600) నిధులు సమకూర్చుతుంది. ఈ మొత్తం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్ల ల సంరక్షణ, చదువు కొనసాగించేందుకు దోహదపడుతుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ, ఫొటో, స్టడీ సర్టిఫికెట్‌(2022–23 మాత్రమే), తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాలు, కోవిడ్‌తో మరణించిన తల్లిదండ్రుల పాజిటివ్‌ టెస్ట్‌ రిపోర్టు, పిల్లల ఆధార్‌, రేషన్‌ కార్డు, సంరక్షకుల ఆధార్‌ కార్డు, పిల్ల ల వ్యక్తిగత లేదా తల్లిదండ్రులతో కలిగి ఉన్న జా యింట్‌ బ్యాంకు ఖాతా పుస్తకం, మీసేవ ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఇవీ అర్హతలు..

వితంతు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లికి చెందిన పిల్లలు.

అనాథ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాథ బాలలు

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు.. ఆర్థిక, శారీరక సమస్యలతో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు

బాల న్యాయ(రక్షణ, ఆదరణ) చట్టం– 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన, ఇల్లు లేని, ప్రకృతి వైపరీత్యాలకు గురైన, బాల్య వివాహ, బాలకార్మిక, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధిత, అక్రమ రవాణాకు గురైన, అంగవైకల్యం, తప్పిపోయిన, పారిపోయిన, వీధి, యాచక, హింసకు, వేధింపులకు, దోపిడీలకు గురైన, సహాయం, ఆశ్రయం అవసరమైన, కరోనా(కోవిడ్‌ –19)తో తల్లిదండ్రులను కోల్పోయిన తదితర పీఎం కేర్‌ పథకం కింద నమోదైన పిల్లలు అర్హులు.

ఆర్థిక పరిమితి

రెసిడెన్సియల్‌ స్కూల్‌లో చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72 వేలకు మించరాదు.

పట్టణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.96 వేలు మించకూడదు.

స్పాన్సర్‌షిప్‌ కాలపరిమితి

ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు అర్హతను బట్టి మూడేళ్లు అవకాశం

ఈ పథకం 18 ఏళ్ల వయస్సు నిండే వరకు లేదా పథకం ముగింపు వరకూ బాలలు విడిచిపెట్టి ఇన్‌స్టిట్యూషన్‌(సీసీఐ) చేరినప్పుడు ఈ స్పాన్సర్‌షిప్‌ ఆర్థిక సహాయం నిలిచిపోతుంది.

పిల్లలు 30 రోజులకు మించి స్కూల్‌కు హాజరు కాకుంటే సదరు స్పాన్సర్‌ షిప్‌ నిలిపివేస్తారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు ఉంటుంది.

పథకానికి అర్హత సాధించిన పిల్లలు భవిష్యత్‌లో ఏదైనా ప్రభుత్వ హాస్టల్‌లో చేరితే అక్కడి నుంచి పథకం వర్తించదు.

స్పాన్సర్‌షిప్‌ కమిటీ వారు ప్రతి సంవత్సరం పథకాన్ని సమీక్షించి అర్హతను బట్టి నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.

తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం వర్తించదు. ఎందుకంటే తండ్రి, పిన తల్లి ఉన్నారు కాబట్టి.

Advertisement

తప్పక చదవండి

Advertisement