సందేహాల ‘జాబితా’
క్లస్టర్ వారీగా వివరాలు
ముసాయిదా ఓటరు లిస్ట్‌లో మార్పులు, చేర్పులకు ప్రజల వినతి
జనగామ: మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓట రు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రజలు సులభంగా అభ్యంతరాలు తెలపడానికి పురపాలక కా ర్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, పొరబడిన ఎంట్రీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జనగామ పట్టణం 13వ వార్డులో ప్రస్తుతం 1,930 ఓట్లు నమోదై ఉండగా, అందులో సుమారు 250కి పైగా ఓట్లు సమీప వార్డులతో పాటు మరణించిన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నట్లు పార్టీ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానుగంటి సువార్తతో సహా స్థానిక నేతలు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశారు. 13వ వార్డుతో సంబంధం లేని ఓట్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఓటరు జాబితా పూర్తిస్థాయి పారదర్శకతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లను కచ్చితంగా తొలగించడం, వార్డుల మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వడం అవసరమని అభిప్రాయపడుతున్నాయి. యంత్రాంగానికి ఇంకా సమయం ఉండడంతో తుది జాబితా పారదర్శకంగా ఉండాలనే ప్రజలు కోరుతున్నారు.
2025 స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల వార్డుల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు(ఏఆర్‌ఓ) నియామక జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ జారీ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నారు. మున్సిపాలిటీల వార్డు కౌన్సిలర్ పదవుల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
జనగామ మున్సిపాలిటీకి చెందిన 30 వార్డులు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన 18 వార్డులకు కలిపి మొత్తం పీజీ హెచ్‌ఎంలను 26 ఆర్‌ఓలు, 26 ఏఆర్‌ఓలు నియమించగా, అదనంగా 10 మంది రిజర్వులో ఉంటారు. ఇందులో జనగామలో 20 మంది ఆర్‌ఓ, 20 మంది ఏఆర్‌ఓ, స్టేషన్ ఘన్‌పూర్‌లో ముగ్గురు ఆర్‌ఓ, ముగ్గురు ఏఆర్‌ఓలు ఉన్నారు. ప్రతి అధికారి మూడు వార్డుల చొప్పున క్లస్టర్ ఆధారంగా బాధ్యతలు స్వీకరించ నున్నారు. జాబితాలో ఉన్న ప్రతి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు తమకు కేటాయించిన జాబ్ చార్ట్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఏ తప్పిదం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
జనగామ 13వ వార్డులో
సంబంధం లేని ఓట్లు
ఎన్నికల మార్గదర్శకాలు లేక
గందరగోళం
అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక
కౌంటర్ల ఏర్పాటు


