పాత నేరస్తులపై నిఘా పెట్టండి
● సీపీ సన్‌ప్రీత్ సింగ్
రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైమ్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్‌కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలుకి వెళ్లి తిరిగి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఉత్తమ పరిశోధనలకు పారితోషికం
కేయూ క్యాంపస్: ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనాపత్రం, ఉత్తమ ప్రాజెక్టు ఉత్తమ ప్రచురణలకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్ధులు అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. మొదటి బహుమతి కింద రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 10లోపు అకడమిక్ బ్రాంచ్‌లో ఆధారాలతోపాటు దరఖాస్తుల సమర్పించాలన్నారు.


