ముస్తాబాద్: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ముస్తాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు చేపట్టిన పాదయాత్ర సోమవారం రాత్రి కేసీఆర్ ఫాంహౌస్ ఎరవెల్లికి చేరుకుంది. ముస్తాబాద్ మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ముస్తాబాద్ నుంచి కొమురవెల్లి, కొండ పోచమ్మ, యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర బృందాన్ని కేసీఆర్ తన నివాసంలో కలుసుకున్నారు. రైతులు, కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పడుతున్న కష్టాలను కేసీఆర్‌కు తెలియజేశారు. పాదయాత్ర చేసిన కొమ్మెట రాజు, కంచం నర్సింలు, పరిధి పేట వెంకటేశ్, జహంగీర్, దేవరాజును కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వీరి వెంట మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, స్వామి, ఎల్లం తదితరులున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన మ్యాకల మహేశ్ (25) రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో రమణ తెలిపారు. మ్యాకల మహేశ్, నవదీప్ బైక్‌పై రాయికల్ నుంచి కుమ్మరిపల్లికి వెళ్తున్నారు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పడిగెల గంగారెడ్డి బైక్‌పై కుమ్మరిపల్లి నుంచి రాయికల్‌కు వస్తున్నాడు. గంగారెడ్డి బైక్‌ను నిలిపి వాహనాల రాకపోకలను చూస్తుండగా.. మహేశ్ వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో మహేశ్, గంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జగిత్యాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మహేశ్ మృతిచెందాడు. గంగారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. నవదీప్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మహేశ్ తండ్రి చిన్నరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయన కళ్లను హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటివైద్యులు సేకరించారు. ఆయన మృతిచెందినా మరో ఇద్దరికి చూపునిచ్చినట్లయ్యింది.
అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని తీన్‌ఖని చౌరస్తా వద్ద సాయిని శంకర్ (49) అనే వ్యక్తి తన టైలర్ షాపులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండే శంకర్ తీన్‌ఖని చౌరస్తాలో టైలరింగ్ షాపు నిర్వహిస్తుంటాడు. కొద్దికాలంగా షాపు నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం షాపులో పనిచేసే వ్యక్తి తలుపులు తీయగా శంకర్ ఉరేసుకుని కనిపించాడు. శంకర్ భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై మహేశ్ తెలిపారు.
ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ శివారులో మంగళవారం ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి నుంచి బీట్కు తిరుపతి అలియాస్ యోహన్, మెంగు దీపక్ బైక్‌పై నిర్మల్ వెళ్తున్నారు. మండలంలోని యామపూర్ గ్రామానికి చెందిన ఆటో ఎర్గట్ల నుంచి వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తిరుపతి కుడి చేయి రెండు వేళ్లు తెగిపోయాయి. దీపక్ కుడికాలు విరిగింది. వారిని 108లో మెట్‌పల్లికి.. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. ఆటో డ్రైవర్ బోరిగం శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. తిరుపతి కుమారుడు అశ్వంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


