కోరుట్లరూరల్: పట్టణ శివారులో నిర్మిస్తున్న జవహ ర్ నవోదయ విద్యాలయం పనులు ఆగిపోయాయి. రెండేళ్ల క్రితం ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవతో విద్యాలయం మంజూరైన విషయం తెలిసిందే. రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ విద్యాలయాన్ని మూడేళ్లలో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ ఏడాది క్రితం పనులు ప్రారంభించాడు. తరగతి గదుల నిర్మాణ డిజైన్లలో జప్యం కారణంగా మొదట నిర్మాణ స్థలం చదును, ప్రహరీ పనులు ప్రారంభించారు.
కూలీలకు వేతనాలు అందక..
విద్యాలయం పనుల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీలతో పనులు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు పనులకు వెళ్లడం లేదు. దీంతో ప్రహరీ పనులు కూడా నిలిచిపోయాయి. కూలీలు భోజన ఖర్చుల కోసం కోరుట్లతోపాటు ఇతర చోట్ల పనులు చేసుకుంటున్నారు. తమ రెండు నెలల వేతనం ఇస్తే స్వగ్రామానికి వెళ్లి పోతామని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందక పోవడంతోనే కాంట్రాక్టర్ కూలీలకు వేతనాలు ఇవ్వటం లేదని తెలిసింది. అధికారులు స్పందించి బిల్లుల మంజూరు చేయించి తమకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.


