● యాసంగి సీజన్‌పై ప్రత్యేక దృష్టి ● రసాయనాల వాడకం తగ్గించి, సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ● వచ్చే నెల 30 వరకు 150 అవగాహన సదస్సులు ● వ్యర్థాల దహనానికి స్వస్తి పలకాలంటున్న వ్యవసాయ శాఖ
గొల్లపల్లి: నేల సంరక్షణే ధ్యేయంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేత్ బచావో అభియాన్ – యాసంగి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మట్టిని రక్షించండి. వ్యవసాయాన్ని రక్షించండి, రైతులను రక్షించండి.. అనే నినాదంతో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల 30వరకు దాదాపు 150 ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు వేదికలు, పొలాల్లో ప్రదర్శనలు ఇస్తూ దిశానిర్దేశం చేయనున్నారు.
భూసార పరీక్షలే ప్రామాణికం
వరి, పత్తి, మిర్చి పంటల్లో రసాయన ఎరువులు మితిమీరిన వాడకం వల్ల నేల సహజ సారం క్రమంగా క్షీణిస్తోంది. దీనిని అరికట్టేందుకు సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగానే ఎరువులు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అమ్మోనియా, జీవ ఎరువుల వాడకంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వరి కోతల అనంతరం ఖాళీగా ఉండే భూముల్లో పెసర, మినుము, శనగ వంటి అపరాలు, ఆవాలు, నువ్వులు, వేరుశనగ వంటి నూనెగింజల సాగుతో పాటు అంతర పంటల ప్రాధాన్యతను వివరిస్తారు.
కొయ్యకాళ్లను కంపోస్ట్‌గా మార్చండి
వరి కోతల తర్వాత పొలాల్లో వ్యర్థాలు, కొయ్యకాళ్లను తగలబెట్టడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నశించి నేల నిస్సారమవుతుందని, వాతావరణ కాలుష్యం తీవ్రమవుతుందని అధికారులు చెబుతున్నారు. పంట అవశేషాలను తగులబెట్టకుండా వర్మి కంపోస్టుగా.. పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువుగా ఎలా మార్చుకోవాలో క్షేత్రస్థాయిలో నేర్పించనున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, సూక్ష్మ సేద్యం వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులను గుర్తించడం, మోసపోతే ఫిర్యాదు చేసే విధానాలపై చైతన్యపరుస్తారు. అలాగే పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం ధన్‌ధాన్య కృషి యోజన వంటి పథకాల ప్రయోజనాలను వివరిస్తారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
40 రోజుల పాటు కొనసాగే ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. శాసీ్త్రయ సాగు పద్ధతులను అలవర్చుకుని భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడి సాధించాలి.
– భాస్కర్, డీఏవో


