కోరుట్లలో నేడు నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

కోరుట్లలో నేడు నిమజ్జనం

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

కోరుట్ల: కోరుట్లలో వినాయక చవితి విభిన్న పంథాలో సాగడం ఇక్కడ ఆనవాయితీ. సాధారణంగా అన్ని చోట్లా నవరాత్రులు ముగియగానే మండపాల వారీగా తీసుకెళ్లి సమీపంలో ఉన్న జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. దీనికి విరుద్ధంగా కోరుట్లలో మాత్రం అన్ని మండపాల నిర్వాహకులు తమ వినాయకులను వాహనాల్లో ఎక్కించి ఒక్కచోటకు తీసుకొచ్చి నిలపడం విశేషం. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు మున్సిపాలిటీ నుంచి రూ.7 లక్షలు కేటాయించడం గమనార్హం.

సందేశాత్మకం..సమాజహితం

పట్టణంలో మండపాల నిర్వాహకులు అందరూ వాహనాల్లో తమ విగ్రహాలను తరలించి మొదట కళాశాల గ్రౌండ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ మున్సిపల్‌ వారు తమకు కేటాయించిన నంబర్లలో వాహనాలను నిలుపుతారు. కీలక, మున్సిపల్‌ ప్రజాప్రతినిధులతో చిన్నపాటి సమావేశం ఉంటుంది. ఆ లోపు కళాశాల మైదానానికి వచ్చిన వినాయక విగ్రహాల అలంకరణ..ఆయా విగ్రహాల నిర్వాహకులు సమాజహితానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న అంశం, మట్టి గణపతి ఆకృతులను పరిగణనలోకి తీసుకుని మొదటి, రెండు, మూడు బహుమతులకు ఎంపిక చేస్తారు. ముందుగా కళాశాల మైదానానికి చేరుకున్న మండప నిర్వాహకులకు కన్సోలేషన్‌ బహుమతి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 315 వినాయక మండపాల నమోదయ్యాయి.

ఒకే రూట్‌..ఒకే వరుస

కళాశాల మైదానం నుంచి బయలుదేరే వినాయక విగ్రహాల శోభాయాత్ర మున్సిపల్‌ కేటాయించిన నంబర్ల ప్రకారం ఒకే వరుసలో కొనసాగుతుంది. శోభాయాత్ర ఐబీరోడ్‌, గోదాం రోడ్‌, జాతీయ రహదారి, కార్గిల్‌ చౌరస్తా, జవహర్‌రోడ్‌, బురుజు, మార్కెట్‌ ఏరియాల నుంచి సంజీవయ్య నగర్‌, అంబేడ్కర్‌ రోడ్‌ నుంచి బతుకమ్మ పూల్‌వాగుకు చేరుకుంటాయి. ఈ రూట్‌లో విద్యుత్‌ స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండటం, తీగలు తగిలే అవకాశం ఉన్నచోట వాటిని సరిదిద్దినట్లు ఏడీఈ భూమేశ్వర్‌ తెలిపారు. వాగులో నిమజ్జనం కోసం ఎస్సారెస్సీ నీటిని విడుదల చేశారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో మూడు చోట్ల గుంతలు తవ్వించారు. అక్కడ క్రేన్‌లను అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లను కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ అధికారులు పర్యవేక్షించారు. అవసరమైన పనులు పూర్తి చేయించారు. సుమారు 125 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

ధర్మపురిలో పూర్తికాని ఏర్పాట్లు

ధర్మపురి: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు ధర్మపురి వద్ద పూర్తికాలేదు. గురువారం గోదావరి తీరంలో కేవలం మొరం పోసి వదిలేశారు. పట్టణంతోపాటు మండలం వ్యాప్తంగా నెలకొల్పిన సుమారు 150విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. పుష్కరఘాట్ల వద్ద క్రేన్లు, బోయల సాయంంతో నిమజ్జనం చేస్తారు. గాంధీచౌక్‌, హనుమాన్‌ విగ్రహం, బోయవాడ మీదుగా గోదావరికి వెళ్లే రహదారులు గుంతలమయంగా మారాయి. వాటిని పూడ్చలేదు. నదీ తీరంలో ట్రాక్టర్లు వెళ్లే దారి ప్రమాదకరంగా ఉంది. మొరం పోసినా చదును చేయలేదు. వర్షం కురిస్తే మొరం బురదలా మారి ట్రాక్టర్లు దిగబడే అవకాశం ఉంది. ఏటా గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు ఆగమేఘాలపై చేస్తున్నారు. శాశ్వతంగా సీసీ రోడ్డు వేస్తే సమస్య ఉండదంటున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌

125 మంది పోలీసులతో బందోబస్తు

వినాయకులన్నీ ఒకే రూట్‌..ఒకే వరుస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement