జగిత్యాల/రాయికల్/గొల్లపల్లి: జిల్లాలో రెండోరోజూ వినాయకుని శోభాయాత్ర సాగింది. జిల్లాకేంద్రంలో బుధవారం వందకు పైగా ప్రతిమలు నిమజ్జనం కాగా.. గురువారం సుమారు 150కుపైగా నిమజ్జనం చేశారు. చింతకుంట చెరువు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. టవర్‌సర్కిల్ వద్ద గణపతికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఒగ్గు, బంజారా, డప్పు కళాకారుల ఆటలు ఆకట్టుకున్నాయి. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు ఉన్నారు. రాయికల్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథులకు వీడ్కోలు పలికారు. ఎస్సై సుధీర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. గొల్లపల్లి మండలం భీమ్‌రాజ్‌పల్లిలో రైజింగ్ స్టార్ యూత్ గణనాథుడి నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. డప్పు చప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య వినాయకుడి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. సర్పంచ్ కొలగాని శ్రీలత, ఉప సర్పంచ్ బొమ్మన రాజమ్మ, రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


