నాడు మీటర్ల బిగింపును తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ తాజాగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రహస్య ఒప్పందం బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా ప్రారంభించారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. గతంలో కేంద్రప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని, ఇప్పుడు ప్రధాని మోదీకి తలొగ్గిన సీఎం రేవంత్ మీటర్ల బిగింపు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చామని, దానిని కేసీఆర్ 24 గంటలు చేశారని గుర్తుచేశారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, సింగరేణిలో జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లు ఆరంభించారని పేర్కొన్నారు. ఎల్‌నినో కారణంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారని, ఎల్‌నినోకు విద్యుత్ ఉత్పత్తికి ఏం సంబంధమని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి తరలింపునకు ఎల్‌నినో అడ్డుకాదన్నారు. ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా అన్నారం, సుందిళ్ల చెక్కుచెదరలేదని తెలిపారని పేర్కొన్నారు. తనకు ఎద్దు లేదు.. ఎవుసం లేదని, తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌నని సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పుకున్నారని, వ్యవసాయం దండగని చంద్రబాబు గతంలో అన్నారని, ఇప్పుడు రేవంత్ కూడా అదే చెబుతున్నారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు సత్యంరావు, ఆకుల రమేశ్, తేలు రాజు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


