చక్కెర ధరకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

చక్కెర ధరకు రెక్కలు

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

● పండుగల పూట రోజురోజుకు పెరుగుతున్న వైనం ● కిలోకు రూ.42 నుంచి రూ.62కు చేరిన ధరలు

జగిత్యాలజోన్‌: రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా, దీపావళి..ఇలా రాబోయేది పండుగల సీజన్‌. ఈ సీజన్‌లోనే అత్యధికంగా వినియోగించే చక్కెర ధర కొద్ది రోజుల్లోనే 50 శాతం పెరిగింది. మొన్నటి వరకు కిలో రూ.42 వరకు ఉన్న చక్కెర ధర, ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో కిలో ఏకంగా రూ.62–65 వరకు వెళ్లింది. దీంతో, రోజు వారీ చక్కెర వినియోగదారులతో పాటు వ్యాపారస్తులు పెరుగుతున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు.

నెలకు 9–10 లక్షల కిలోల వినియోగం

జిల్లాలోని జనాభా ప్రకారం నెలకు 9–10 లక్షల కిలోల చక్కెర వినియోగం అవుతున్నట్లు అంచనా. సాధారణంగా ఒక్క కుటుంబం నెలకు 2–4 కిలోల చక్కెరను చాయ్‌, కాఫీ, పాలు, స్వీట్స్‌ వంటి వాటికి వినియోగిస్తుంది. పండుగల సీజన్‌ నేపథ్యంలో, ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు చెక్కర వినియోగం 15 శాతం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు, చక్కెర నిల్వలు తగ్గుముఖం పట్టడంతో, చక్కెర రేటు సైతం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

చక్కెర రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే..

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో చెరుకు పంట ద్వారా వచ్చే చెరుకు రసాన్ని చక్కెర ఉత్పత్తికి కాకుండా ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. దీంతో, ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, పలు ప్రైవేట్‌ చక్కెర కంపెనీలు చెరుకు రసాన్ని ఇథనాల్‌ తయారీకి ఉపయోగిస్తున్నాయి. దీనికి తోడు, చెరుకు ఎక్కువగా పండే మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి గత కొన్నేళ్లలో లేనంతగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది కూడా చెరుకు పంట తగ్గే అవకాశం ఉందనే కారణం కూడా ధరల పెరగడానికి కారణమైంది. దీనికి తోడు, జిల్లాలోని ముత్యంపేట వంటి చక్కెర ఫ్యాక్టరీలు చాలా వరకు మూతపడ్డాయి. ఇప్పుడు దేశీయంగా డిమాండ్‌ పెరగడంతో, ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ధరలు పెరుగుతాయనే ఆశతో నిల్వలు

కొంతమంది వ్యాపారస్తులు చక్కెర ధరలు మరింతగా పెరుగుతాయనే ఆశతో బస్తాల కొద్ది నిల్వ చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్‌లో స్వీట్లు, బేకరీ వస్తువులు, కూల్‌ డ్రింక్స్‌కు చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో, మార్కెట్లో డిమాండ్‌ పెరగుతూ, రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం 15 రోజుల కంటే ఎక్కువగా చక్కెర నిల్వలను దాస్తే, కేసులు నమోదు చేయాలని కూడా అదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement