ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించండి

Aug 18 2026 12:39 AM | Updated on Aug 18 2026 12:39 AM

జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 41 వినతులు వచ్చాయని, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక నుంచి అన్ని ఫైల్స్‌ ఈ ఆఫీసు ద్వారానే పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, రెవెన్యూ అధికారులు ప్రసాద్‌ పాల్గొన్నారు.

బాడ్మింటన్‌లో కోరుట్లవాసుల ప్రతిభ

కోరుట్ల: స్వాతంత్ర వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించిన ఉత్తర తెలంగాణ స్థాయి సీనియర్స్‌ షటిల్‌ బాడ్మింటన్‌ టోర్నీలో కోరుట్ల క్రీడాకారులు ఫైనల్‌లో గెలిచి కప్‌ అందుకున్నారు. రెండు రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో సుమారు 26 జట్లు పాల్గొనగా.. కోరుట్లకు చెందిన కొత్తపల్లి గణేశ్‌, పిట్టల నర్సింలు డబుల్స్‌లో ఫైనల్‌లో గెలుపొందారు. వీరిని కోరుట్ల షటిల్‌ బాడ్మింటన్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో కల్యాణలక్ష్మీపై స్టే

జగిత్యాల: కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌పై హైకోర్టు స్టే విధించిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పథకాలకు సంబంధించిన 8 జీవోలపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చినా కౌంటర్‌ దాఖలు చేయలేదని, పేదలకు అందాల్సిన పథకాలను సమర్థించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు పథకాలు అమలు చేశామని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి హైకోర్టులో సమగ్రమైన అఫిడవిట్‌ దాఖలు చేయాలన్నారు.

జీవనభృతి అమలు చేయాలి

జగిత్యాల: బీడీ కార్మికులకు జీవనభృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నామని రాష్ట్ర బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఫెడరేషన్‌ రాములు అన్నారు. పట్టణంలోని ఏఐటీయూసీ భవనంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద మేనిఫెస్టోలో రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో కొక్కుల శాంత, ముఖ్రం, మహేశ్‌, కిరణ్‌, ధర్మయ్య పాల్గొన్నారు.

ఆరోగ్యకార్డుల మినహాయింపు ఆపాలి

జగిత్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల వేతనాల నుంచి ఆరోగ్యకార్డుల కోసం మినహాయిస్తున్న మొత్తాలను ఆపేయాలని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య అన్నారు. సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. హెచ్‌ఎస్‌ పథకం కింద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే మినహాయింపులు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్థిక, ఆరోగ్య నష్టానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదరలేదన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 1.5 శాతం మినహాయింపులు కాకుండా కుటుంబసభ్యుల మేరకు మినహాయింపులు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, రవి, బాలాజీ, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement