పోలీస్‌పై పొలిటికల్‌ పడగ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌పై పొలిటికల్‌ పడగ

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

● ఒత్తిళ్లతో నలిగిపోతున్న ఖాకీలు ● తలనొప్పిగా మారిన తీరు

కోరుట్ల: ఖద్దరు నేతల వ్యవహారం ఖాకీలకు శాపంగా పరిణమిస్తోంది. పోస్టింగ్‌ల కోసం నేతలను పోలీసులు ఆశ్రయించడం సహజం. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ నేతను ఆశ్రయించి పోస్టింగ్‌ పొందితే మరో నేతకు కంటగింపుగా మారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కీలక నేతల మధ్య విభేదాలు పోలీసులను కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో పడేస్తున్న వైనం కలవరం రేపుతోంది. కొంతకాలంగా జిల్లాలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఓ ఎస్సై సస్పెన్షన్‌ వ్యవహారంలోనూ ఈ తీరు కనిపించిందన్న చర్చ పోలీసువర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.

నేతల తఖరారు..

జిల్లాలో ఏడాదిన్నర కాలంగా నేతల మధ్య విభేదాలు పోలీసుల పోస్టింగ్‌లు, పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏడాదిన్నర క్రితం జిల్లా కేంద్రంలో ఓ డీఎస్పీ విషయంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో జగిత్యాల డీఎస్పీ ఒకరు బదిలీ కాగా.. ఇటీవల పార్టీ మారిన అప్పటి అధికార పార్టీ నేత తీవ్రంగా పరిగణించి ఆ పోస్టింగ్‌ను రద్దు చేయించారు. కొత్తగా వచ్చిన డీఎస్పీ కేవలం ఒక్కరోజు మాత్రమే జిల్లా కేంద్రంలో పనిచేశారు. ఆ తరువాత పాత డీఎస్పీ యథాస్థానంలోకి వచ్చి విధులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సదరు నేతల మధ్య విబేధాలతో కొంతమంది సీఐలు, ఎస్సైలు ఇదే రీతిలో పోస్టింగ్‌ సమస్యలతో అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఓ కీలక నేత పార్టీ మారడంతో పరిస్థితి ఎంతో కొంత సద్దమణిగినట్లు కనిపిస్తోంది. ఇదే రీతిలో జిల్లాలోని నిజామాబాద్‌ సరిహద్దు ప్రాంతంలోని ఓ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ బదిలీ అయ్యారు. ఇలాగే మరికొన్ని సర్కిళ్లలోనూ ఆయా ప్రాంతాల కీలక నేతలకు నచ్చని పోలీసు అధికారులు తక్కువ కాలం పనిచేసి పోస్టింగ్‌లు వదులుకుని వెళ్లిపోయారు.

పనితీరుపై ఒత్తిళ్లు

జిల్లాలో కీలకంగా ఉన్న జగిత్యాల, జగిత్యాల రూరల్‌, టౌన్‌, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ఇబ్రహీంపట్నం, మల్యాల వంటి పోలీస్‌స్టేషన్‌ల పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఆయా ఠాణాల్లో క్రైం రేట్‌ అధికంగా ఉండటంతో పాటు నేర సంఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నేతలకు చెందిన నియోజకవర్గ కీలక నేతలతో పోస్టింగ్‌లు పొందినప్పటికీ ఆయా పోస్టింగ్‌లను కాపాడుకోవడంపైనే దృష్టి సారించేసరికి నేరాల నియంత్రణపై పట్టు జారిపోతోంది. దీనికి తోడు కీలక నేతల అనుయాయుల ఒత్తిళ్లు.. ఠాణాల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు.. తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బంది ఫలితంగా వాటి పరిష్కారం చేసే దిశలో ఎదురయ్యే సమస్యల మధ్య పోలీసులు కొంతమేర తప్పటడుగులు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వీటి ఫలితంగానే ఇటీవల కాలంలో రౌడీషీటర్లు, నిందితులపై నిఘా తగ్గిపోయి కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల కీలక సర్కిళ్లలో హత్య సంఘటనలు, చోరీలు, దొంగతనాలు పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement