పొరండ్లలో అదుపులోకొచ్చిన జ్వరాలు
జగిత్యాల రూరల్: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారిస్తే వ్యాధులను అరికట్టవచ్చని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో విష జ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో ఆదివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషజ్వరాలు వ్యాపించకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్షకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి బావిలో క్లోరినేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు అవసరమైన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు అర్చన, నరేంద్ర, రాజేందర్, మండల వైద్యాధికారి సౌజన్య, సర్పంచ్ నక్క హరీశ్, ఉప సర్పంచ్ ముద్దం మల్లేశం గౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చూడండి
గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. పొరండ్లలో విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, నాయకులు రాధాకిషన్‌రావు, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, శేఖర్, సతీశ్, రాము, విష్ణు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పొరండ్లలో ఇటీవల ఇద్దరు చిన్నారులు విషజ్వరంతో మృతి చెందగా.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, మహేశ్, లింగన్న, బాలు, శ్రీను, రాము, పవన్ పాల్గొన్నారు.
చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు
బాధితులకు మందులు అందిస్తున్న సిబ్బంది


