కాగితం కార్డులకు చెల్లిన కాలం
ఏటీఎం తరహా అందజేత
జిల్లాకు చేరిన 2.80 లక్షల కార్డులు
త్వరలో పంపిణీకి శ్రీకారం
జిల్లా వివరాలు
అక్రమాలకు చెక్
దశలవారీగా పంపిణీ చేపడతాం
గొల్లపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త పద్ధతికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కాగితపు లామినేషన్ రేషన్‌కార్డుల స్థానంలో అత్యంత ఆధునికమైన, ఆకర్షణీయమైన పీవీసీ స్మార్ట్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు కేటాయించిన కార్డులన్నీ ఇప్పటికే చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ యంత్రాంగం పంపిణీకి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
చెరగవు.. చిరిగిపోవు
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3.53లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త స్మార్ట్‌కార్డులు జారీ చేయనున్నారు. ఇవి ఏటీఎంకార్డుల తరహాలోనే ధృడంగా ఉండటంతోపాటు సుదీర్ఘకాలం మన్నికగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కార్డుల్లో లబ్ధిదారుడి పూర్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. కార్డు నీటిలో తడిచినా.. ఎంతకాలం వాడినా వివరాలు చెరిగిపోవడం లేదా కార్డు చిరిగిపోవడం వంటి సమస్య ఉండదు.
బహుళ ప్రయోజనాలు
ఈ స్మార్ట్ కార్డు కేవలం నెలానెలా బియ్యం, సరుకులు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు అధికారులు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డునే ప్రామాణికంగా ఉపయోగించనున్నారు. కుటుంబ వివరాల ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సేవలను వేగంగా పొందడానికి ఈ కార్డు సహాయపడనుంది.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
జిల్లాకు ఇప్పటికే 2.80లక్షల స్మార్ట్‌కార్డులు చేరుకున్నాయి. వాటిని పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే నియోజకవర్గాలు, మండలాల వారీగా రేషన్ దుకాణాలు లేదా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వీటిని అందజేస్తారు.
రేషన్ దుకాణాలు 595
కొత్తకార్డులు 45,103
పాత కార్డులు 3,07,897
లబ్ధిదారులు 9,99,109
ప్రతినెలా బియ్యం పంపిణీ 6300 టన్నులు
స్మార్ట్ కార్డుల రాకతో పీడీఎస్ వ్యవస్థలో అక్రమాలకు శాశ్వతంగా తెరపడనుంది.
బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది.
డిజిటల్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం కానుంది.
డూప్లికేట్, బోగస్‌కార్డులను సులభంగా ఏరిపారేసే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి లబ్ధిదారుల సమగ్ర వివరాల నిర్వహణ మరింత సులభంగా, వేగవంతంగా మారనుంది.
జిల్లాకు అవసరమైన స్మార్ట్‌రేషన్ కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందిన వెంటనే మండలాల వారీగా, పారదర్శకంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తాం. మన్నికగా ఉండే ఈ కొత్త కార్డులు భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందేందుకు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయి.
– జితేందర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి


