● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శుక్రవారం కలెక్టరేట్‌లో అవార్డులు ప్రదానం చేసి మాట్లాడారు. మహిళలకు శక్తి సామర్థ్యాలు అనంతమని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా పార్లమెంట్‌కు వెళ్తున్నారని, మహిళల్లో ఉన్న అంతర్గత శక్తిని చూసి కొందరు భయపడుతున్నారన్నారు. మహిళలు ధైర్యంగా ఉండి తోటివారికి అండగా నిలవాలన్నారు. ఆలోచనల్లో ఆధునీకత ఉండాలే కానీ, అది కేవలం చదువు వల్ల రాదని, మనుసు నేర్చుకోవడం ద్వారా వస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది మహిళలకు అవార్డులు అందజేశారు. జగిత్యాల, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్లు సమిండ్ల వాణి, వేముల నాగలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి రాజ్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, మెప్మా ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
క్షయ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
జగిత్యాల: క్షయ బాధితులు వైద్యసేవలు వినియోగించుకోవాలని క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో నిర్వహించిన టీబీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. క్షయపై అవగాహన కల్పించి, బాధితులకు ప్రత్యేక పరీక్షలు, మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులున్నాయని వారికి వివరించాలన్నారు. కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ సునీత, వైద్యాధికారులు పాల్గొన్నారు.
బ్రిడ్జి పనులు పూర్తి చేయండి
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్ల–కొనాపూర్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం బ్రిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. పనుల్లో జాప్యం కారణంగా తాము రవాణా కష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వారి వద్దకు వెళ్లి సమస్య తెలుసుకున్నారు. బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడికక్కడే సంబంధిత ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్, కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే రాయికల్ మండలం రామాజీపేట, మైతాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.


