జగిత్యాలటౌన్: భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవం నిర్వహించారు. స్వయం సేవకులు పథసంచలన్ చేపట్టారు. దారి పొడవునా మహిళలు స్వాగతం పలికారు. విద్యానగర్ రామాలయం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణామూర్తి మాట్లాడారు. మన అనైక్యతతో విదేశీయులు పరిపాలించారని, గ్రీకులు, హునులు, కుషానులు, శకులు, మొగలులు, ఆంగ్లేయులను ఎదిరించిన శాలివాహనుడు, విక్రమాదిత్య మహారాజ్, రాణాప్రతాప్, శివాజీ మహారాజ్ వంటి మహావీరులు మన దేశాన్ని కాపాడారని గుర్తుచేశారు. రామకృష్ణ పరమహంస, దయానందసరస్వతి, వివేకానంద, ఆదిశంకరాచార్య లాంటి మహామహులు సనాతన హిందు ధర్మాన్ని కాపాడారని, హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను వందేళ్ల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైద్యులు ఓరుగంటి నితిన్‌రావు, భీమనాతిని శంకర్, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, నగర సంచాలక్ జిడిగె పురుషోత్తం, 500మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.


