జిల్లాలో 71.13 కిలోమీటర్ల ఇంటర్ కారిడార్ 240 మంది రైతుల నుంచి 250 హెక్టార్ల భూసేకరణ
జగిత్యాలరూరల్: ఆర్మూర్ నుంచి జగ్దల్‌పూర్ వరకు ఇంటర్ కారిడార్ (ఐసీఆర్) ఎన్‌హెచ్–63తోపాటు ఎన్‌హెచ్–563 నిర్మాణానికి జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. రైతులకు నేరుగా పరిహారం అందించేందుకు గతంలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యింది. 240 మంది రైతుల నుంచి 250 హెక్టార్ల భూసేకరణ చేశారు. ఎన్‌హెచ్–63లో భూములు కోల్పోతున్న రైతులకు రూ.188.23 కోట్లు, ఎన్‌హెచ్–563లో భూములు కోల్పోతున్న రైతులకు రూ.111.58 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. పరిహారం విడుదల కావడంతో రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి విడత విడుదలైన నిధులను భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
టెండర్ల ఆహ్వానానికి సిద్ధం
ఆర్మూర్–జగ్దల్‌పూర్ వరకు ఎన్‌హెచ్–63, జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఎన్‌హెచ్–563 రహదారుల నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. టెండర్లు పూర్తికాగానే రెండు నేషనల్ హైవేల పనులు వేగవంతంగా కొనసాగనున్నాయి. పనులు పూర్తయితే ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి.
జిల్లాలో 71.13 కిలోమీటర్లు
జిల్లాలో నేషనల్ హైవే–63ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగ్దల్‌పూర్ వరకు నిర్మించనున్నారు. ఇది జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి నుంచి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వరకు 71.13 కిలోమీటర్లుగా ఉంది.
ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి
నేషనల్ హైవే–63 ని ర్మాణం కోసం భూసేకరణ పూర్తయ్యింది. భూములు కోల్పోయిన రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఎన్‌హెచ్–563లో భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతున్నాయి.
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల


