మోగని నీటిగంట | - | Sakshi
Sakshi News home page

మోగని నీటిగంట

Mar 14 2026 7:54 AM | Updated on Mar 14 2026 7:54 AM

జగిత్యాల: గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు తప్పనిసరిగా గంటకోసారి నీరు తాగాలని వాటర్‌బెల్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేరళలో నీటిగంట మూడుసార్లు ఏర్పాటు చేయగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ, అది పెద్దగా అమలులోకి రాలేదు. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉంటారు. వీరు ఇంటర్వేల్‌లో తప్ప నీరు తాగరు. వాస్తవంగా దానిపై పెద్దగా శ్రద్ధచూపరు. అయితే బడి వేళల్లోనే సుమారు 1.5 లీటర్ల నీటిని విద్యార్థులు తీసుకుంటే మేలని వైద్యులు పేర్కొంటున్నారు. సమయాన్ని బట్టి 3–5 సార్లు కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫస్ట్‌బెల్‌, సెకెండ్‌బెల్‌, ఇంటర్వల్‌, ఇంటిబెల్‌.. ఇలా ఉన్నప్పటికీ దీనిని పెద్దగా అమలు చేయడం లేదు. కేరళ, కర్నాటకలో దీనిని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు తగిన మోతాదులో నీటిని తీసుకోకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు.

గతంలో అమలు చేసినా..

విద్యార్థి దశ నుంచి పిల్లలు తగినంత నీరు తాగేలా గతంలో జిల్లాలో అక్కడక్కడ వాటర్‌ బెల్‌ అమలు చేసినా, తర్వాత అది మరుగునపడింది. సాధారణ రోజుల్లో ఇంటర్‌వెల్‌, లంచ్‌ బ్రేకులతో పాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్‌ బెల్‌ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలోని పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కానీ, వాటర్‌ బెల్‌ అమలు చేయకపోవడంతో విద్యార్థులు తగినంత నీరు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

నీరు తాగకుంటే సమస్యలు

ప్రస్తుతం వేడి గాలులు సైతం వీస్తున్నాయి. ఇప్పుడు నీరు లేకపోతే విద్యార్థులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. నీటి మోతాదు తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, అపెండెక్స్‌, జ్వరం, మలబద్దకం, మూర్చ, కాలేయ, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

తాగే అవకాశం ఉన్నా..

ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. తాగే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక నీటిని తీసుకోవడం లేదు. వాటర్‌కు కాలం అనేది లేదు. శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ నీటిని తీసుకోవాలి. స్కూళ్లలో నీటి వసతి ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువగా తాగడం లేదని తెలుస్తోంది.

అమలుకు నోచుకోని వాటర్‌బెల్‌

ముదిరిన ఎండలతో పిల్లల్లో డీహైడ్రేషన్‌ సమస్యలు

నీరు తాగేలా ప్రోత్సహిస్తేనే పిల్లల ఆరోగ్యానికి మేలు

ప్రాథమిక పాఠశాలలు 480

విద్యార్థులు 22,756

ప్రాథమికోన్నత పాఠశాలలు 240

విద్యార్థులు 28,061

హైస్కూల్స్‌ 347

విద్యార్థులు 98,200 (సుమారు)

జిల్లాలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement