గల్ఫ్ రోగులపై శీత కన్ను
మోర్తాడ్(బాల్కొండ): బహ్రెయిన్ దేశంలో ఉపాధి పొందుతున్న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంకు చెందిన ముచ్చె నాగయ్యకు ఏడాది క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అక్కడి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అచేతన స్థితిలో ఉన్న నాగయ్యను మాతృభూమికి పంపిస్తే ఇక్కడ తాము దగ్గరుండి వైద్యం చేయించుకుంటామని కుటుంబ సభ్యులు కోరడంతో ఈనెల 4న హైదరాబాద్‌కు పంపించారు. నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా నాగయ్యను ఆస్పత్రిలో చేర్చుకోడానికి నిమ్స్ ఎన్‌వోసీని కూడా ఇచ్చింది. నాగయ్యను ఎయిర్‌పోర్టు నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా తాము ఏమీ చేయలేమని ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నాగయ్యను ఎలా అంబులెన్స్‌లో నిమ్స్‌కు తరలించారో అలాగే ఇంటికి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు.
● జగిత్యాల్ జిల్లా మల్లాపూర్‌కు చెందిన నక్క శ్రీనివాస్ అలియాస్ బైకాన్ శ్రీనివాస్ సౌదిలో పని చేస్తున్న చోట అనారోగ్యానికి గురైనాడు. అతనికి పక్షవాతం సోకడంతో మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తరలించాలని భార్య రాధ ప్రవాసీ ప్రజావాణిలో మొరబెట్టుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బుధవారం నాడు శ్రీనివాస్‌ను సౌది అరేబియా నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ ఇన్ పేషెంట్‌గా చేర్చుకోవాల్సి ఉన్నా కేవలం టెస్టులు చేసి కొన్ని గంటల వ్యవధిలోనే బయటకు పంపించారు. బెడ్ అలాట్ చేయకపోవడంతో చేసేది లేక శ్రీనివాస్‌ను ప్రైవేటు ఆస్పత్రికి అతని కుటుంబ సభ్యులు తరలించారు.
● జగిత్యాల్ జిల్లా పొలాసకు చెందిన ఆరెల్లి గంగారాజం దుబాయ్‌లో అనారోగ్యానికి గురికాగా అతనితోనే ఉన్న కొడుకు జలంధర్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో గడచిన నెలలో హైదరాబాద్‌కు తన తండ్రిని తీసుకుని వచ్చాడు. నిమ్స్‌లో ఒక్కరోజు మాత్రమే ఉంచుకుని ఇంటికి పంపించారు. చివరకు జగిత్యాల్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా నాలుగు రోజుల తరువాత(డిసెంబర్ 24, 2025న) మరణించాడు.
● సౌదీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఎల్కతుర్తికి చెందిన కృష్ణమూర్తి అనారోగ్యంతో కోమాలోకి వెళ్లగా హైదరాబాద్‌కు తరలించారు. సౌదిలోని కృష్ణమూర్తి పని చేస్తున్న కంపెనీ చొరవ తీసుకోవడం, ఆరోగ్య బీమా ఉండటంతో నిమ్స్‌లో కాకుండా కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఇలా నాగయ్య, నక్క శ్రీనివాస్, ఆరెల్లి గంగరాజంలు నిమ్స్‌లో మంచి వైద్యం లభిస్తుందనే ఆశతో గల్ఫ్ నుంచి ఇక్కడికి వస్తే నిరాశే ఎదురైంది. కృష్ణమూర్తి లాంటివారికి కంపెనీల అండ ఉండటంతో కార్పొరేట్ వైద్యం అందించడానికి వీలు ఏర్పడింది.
● ప్రతీ నెలా ఇద్దరు, ముగ్గురు తెలంగాణ జిల్లాలకు చెందినవారు గల్ఫ్ దేశాల్లో అనారోగ్యానికి గురై ఇంటిబాట పడుతున్నారు. అలాంటి వారికి నిమ్స్‌లో వైద్యం అందించాలని ప్రభుత్వంలోని జీడీఏ ఎన్నారై శాఖ ఉత్తర్వులను జారీ చేస్తే నిమ్స్‌లో వాటిని చెత్తబుట్ట దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న రోగులను ఇక్కడకు తరలించాలంటే తాము తమ ఆస్పత్రిలో చేర్చుకుంటామని యాజమాన్యం ఎన్‌వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ పేషంట్లను చేర్చుకోడానికి నిమ్స్ ఆస్పత్రి ఎన్‌వోసీలను జారీ చేస్తున్నా రోగులను తరలించిన తరువాత నిర్లక్ష్యం జరుగుతోంది. వైద్యం అందించడానికి ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వలస కార్మికులు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారి కుటుంబాలకు డబ్బు పంపిస్తుంటే, ట్యాక్స్ రూపంలో మన దేశానికి ఆదాయం లభిస్తోంది. అయితే వలస కార్మికులు అనారోగ్యానికి గురైతే వైద్యం అందించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గల్ఫ్ నుంచి వచ్చే రోగుల కోసం నిమ్స్‌లో సమన్వయం చేయడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని వలస కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గల్ఫ్ వలస కార్మికులకు నిమ్స్‌లో లేదా ఇతర ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నాగయ్యను తమ ఆస్పత్రిలో చేర్చుకుంటామని ఎన్‌వోసీ జారీ చేసిన నిమ్స్ ఆస్పత్రి
అంబులెన్స్‌లో నిమ్స్‌కు వచ్చిన నాగయ్య అతని కుటుంబ సభ్యులు(ఫైల్)
గల్ఫ్ దేశాల్లో మానసిక ఒత్తిడి, ఇతర కారణాలలో అనారోగ్యం పాలు
హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తే అందని వైద్యం
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులు
గల్ఫ్ రోగులపై శీత కన్ను
గల్ఫ్ రోగులపై శీత కన్ను


