సునోజీ..ఏఐ గురూజీ..!
ప్రభుత్వ పాఠశాలల్లోని వెనకబడ్డ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఏఐ విద్యాబోధన సాగుతోంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులలో డిజిటల్ పాఠాల ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచుతున్నారు. కంప్యూటర్ల ద్వారా వీడియో, ఆడియో పాఠాలు వింటున్న విద్యార్థులలో వినూత్న మార్పులు వస్తున్నాయి. డిజిటల్ పాఠాలు వినేందుకు స్కూల్‌కు వస్తున్న విద్యార్థుల సంఖ్య సైతం ఇటీవల గణనీయంగా పెరిగింది. సర్కారీ స్కూళ్లలో ఏఐ విద్యాబోధన వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది.
● పెద్దపల్లి జిల్లాలో 21 స్కూళ్లలో..
రామగుండం/జూలపల్లి/పెద్దపల్లిరూరల్/ఓదెల/కాల్వశ్రీరాంపూర్/ధర్మారం: పెద్దపల్లి జిల్లాలో 21 పాఠశాలల్లో ఏఐ పాఠాలను 268 కంప్యూటర్ల ద్వారా బోధిస్తున్నారు. చదవడం, రాయడంలో వెనకబడ్డ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఏఐ పాఠాలు వినేందుకు 75 హెడ్‌సెట్లను అందించారు. ప్రత్యేక పిన్ నంబర్‌తో లాగిన్ కాగానే పాఠాలు మొదలవుతున్నాయి. గతేడాది మార్చి 15 నుంచి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఓదెల మండలంలోని కొలనూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. గతేడాది డిజిటల్ బోధన ప్రారంభమైంది. అంతర్గాం ప్రాథమిక పాఠశాలకు మూడు నెలల క్రితం ఏఐ బోధనకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదట్లో ఒకే కంప్యూటర్ మంజూరుకాగా.. ఇటీవల మరో కంప్యూటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. జూలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత పాఠాలు నేర్పుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఎంపికై న మొదటి పాఠశాల గంగారం ప్రైమరీ స్కూల్. విద్యాశాఖ చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ధర్మారం మండలంలోని కొత్తూరు, నర్సింహులపల్లి గ్రామాల్లో ఏఎక్స్‌ఎల్ పాఠాలు ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. కొత్తూరు ప్రాథమిక పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన ప్రభావవంతంగా నడుస్తోంది.
సునోజీ..ఏఐ గురూజీ..!


