సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సిరిసిల్లకల్చరల్/ఇల్లంతకుంట: జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్‌లో డిజిటల్ బోధనతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీ, నిరంతరం ఇంటర్నెట్, పాఠ్య విషయాలన్నీ డిజిటలైజ్ కావడంతో విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కొనసాగుతుండడంతో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. డిజిటల్ బోధనతో పాఠశాలలో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్‌ల ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతీ స్కూల్‌కు మూడేసి డిజిటల్ బోర్డులను సమకూర్చారు. విద్యార్థులు సైతం పాఠ్యాంశాలను డిజిటల్ చిత్రాలు, ఫ్లోచార్టులు, త్రీడైమెన్షన్ డయాగ్రామ్స్‌ను పరిశీలిస్తూ అర్థం చేసుకుంటున్నారు.
మద్రాస్ ఐఐటీ సహకారంతో..
ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి, ఇల్లంతకుంట, రేపాక హైస్కూళ్లు మద్రాస్ ఐఐటీ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కు జూలై 2025లో ఎంపికయ్యాయి. అప్పటి నుంచి ఈ మూడు పాఠశాలలలో పదోతరగతి విద్యార్థులు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లో చెప్పే పాఠాలు వింటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సైన్స్ ఫౌండేషన్ కోర్సులు, కోడింగ్ ప్రాథమిక అంశాలు నేర్చుకుంటున్నారు.
డిజిటల్ క్లాసులు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమ్ థింగ్ నుంచి ఎవ్రీ థింగ్ వరకు అన్ని సబ్జెక్టుల్లోని విషయాలతోపాటు అదనపు జ్ఞానం సంపాదించేందుకు ఈ క్లాసులు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి తరగతులు మాకు వరం.
– గుంటుక లిఖిత, విద్యార్థిని
పుస్తకంతో పోల్చినప్పుడు డిజిటల్ క్లాస్ బహుళ ప్రయోజనకారి. ఆడియో, వీడియోతోపాటు కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వైజ్ఞానిక అంశాలతోపాటు భాషా బోధనలోనూ అనువుగా ఉన్నాయి. విస్తృత అధ్యయనానికి ప్రేరణ ఇచ్చేలా తీర్చిదిద్దబడ్డాయి.
– బడుగు రాంబాబు, సిరిసిల్ల ఉపాధ్యాయుడు
ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ రూపొందించిన స్కూల్ కనెక్టివిటీ ప్రోగ్రాం ఇల్లంతకుంట మండలంలోని రేపాక, గాలి పెల్లి, ఇల్లంతకుంట విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులకు అవసరమైన ఫౌండేషన్ మ్యాథమెటిక్స్‌తో కూడిన కోడింగ్ నేర్చుకునే అవకాశం కూడా విద్యార్థులకు ఉపయోగపడింది.
– ఎం.మహేశ్‌చంద్ర, గైడ్‌టీచర్, ఇల్లంతకుంట హైస్కూల్
ఇంట్రడక్షన్ టు డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 8 వారాల కోర్సులో చేరాను. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్నపాటి ప్రోగ్రామ్స్ చేయడం నేర్చుకున్నాను. 8 వారాలలో ప్రశ్నోత్తరాలు ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాను. పరీక్షలలో బీటెక్‌లో ఉన్న సిలబస్‌కు సంబంధించిన అంశాలు ఇచ్చారు.
– పండుగ సహస్ర, ఇల్లంతకుంట హైస్కూల్
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు


