నేటి నుంచి హైదరాబాద్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైలు
రామగుండం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే కోల్‌బెల్ట్ రూట్‌పై కనికరం చూపిందని చెప్పుకోవచ్చు. పక్షం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వైపు ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో కోల్‌బెల్ట్ వైపు పండుగ ప్రత్యేక రైళ్లపై సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రతినిధి అనుమాస శ్రీనివాస్, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణికుమార్ ద.మ.రైల్వే జీఎం, డివిజనల్ రైల్వే మేనేజర్లపై ఒత్తిడి తీసుకురావడంతో రైల్వేశాఖ దిగొచ్చింది. అలాగే ‘సాక్షి’లో ఈనెల 1న ‘ప్రయాణికుల రద్దీ అధికం.. రైళ్ళ సంఖ్య తక్కువ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై రైల్వేశాఖ స్పందిస్తూ ఈనెల 9 నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
– రైలు నం.07469 హైదరాబాద్– సిర్‌పూర్‌కాగజ్‌నగర్ మధ్య 9,10వ తేదీల్లో ఉదయం 7.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకుంటుంది.
– రైలు నం.07470 సిర్‌పూర్‌కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య 9,18వ తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలుకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేర్, జనగాం, ఘనాపూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.


