రెండేళ్లుగా ‘హానీట్రాప్’ దందా..!?
● బాధితులు ఎందరో..
● నిందితుల్లో ముగ్గురు రిమాండ్..
● మరింత లోతుగా విచారణ
మెట్‌పల్లిరూరల్: మూడురోజుల క్రితం మెట్‌పల్లి లో వెలుగుచూసిన హానీట్రాప్ దందాలో లెక్కలేని మంది బాధితులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రెండేళ్లుగా ఈ ముఠా తమ దందాను కొనసాగించినట్లు సమాచారం. ముఠాలో ముగ్గురిని బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కిన అనంతరం తిరిగివస్తామని చెప్పి జాడలేకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
రెండేళ్లుగా దందా
మెట్‌పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందా సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుని సెల్‌ఫోన్‌లో పదుల సంఖ్యలో వీడియోలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానీ ట్రాప్‌లో చిక్కుకుపోయిన నిందితులు తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో ఈ ముఠా అడిగినంత మేర డబ్బులు చెల్లించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొంత మంది వ్యాపారులు, రియల్టర్లు, చిన్నాచితక లీడర్లు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో కొంతమంది బాధితులు పోలీసులను కలిసి తాము కూడా మోసపోయామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఈ వ్యవహారంపై వేగవంతంగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుల సెల్‌ఫోన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించే యత్నాల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకరి సెల్‌పోన్‌లో సుమారు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
రౌడీషీటర్ నేతృత్వంలో హానీట్రాప్ దందాకు తెరలేపి.. ఉచ్చులో పడిన వ్యాపారుల నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్‌కుమార్ ఆలియాస్ రాజు రౌడీషీటర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒంటరిగా ఉంటున్న బల్మూరి స్వప్నతోపాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్(రౌడీషీటర్), మాగని దేవనర్సయ్యతో ముఠా ఏర్పాటు చేశాడు. ఒక గదిని అద్దెకు తీసుకుని స్వప్నతో ధనవంతులైన వ్యాపారులకు ఫోన్ చేయించి కవ్వించి ట్రాప్ చేయించేవారు. స్వప్న ట్రాప్‌లో పడినవారిని గదికి పిలిపించి వారి నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలు వసూలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఒక వ్యాపారిని టార్గెట్ చేసి డిసెంబర్ 28న గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసి రూ.10లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు చేయగా, ముఠా గుట్టురట్టయింది. రౌడీషీటర్ రాజ్‌కుమార్, బల్మూరి స్వప్న, మాగని దేవనర్సయ్యను అరెస్టు చేశామని, బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్ పరారీలో ఉన్నారని సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. మెట్‌పల్లి ఎస్సై కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రెండేళ్లుగా ‘హానీట్రాప్’ దందా..!?


