చిట్టీ డబ్బులు అడిగినందుకు దారుణహత్య
జగిత్యాలక్రైం: చిట్టీ డబ్బులు అడినందుకు కొలగాని అంజయ్య (55)ను దారుణంగా హత్య చేశారు. జగిత్యాలలోని గోవిందుపల్లి కి చెందిన అంజయ్య మెస్‌తోపాటు, చిట్టీలు నిర్వహిస్తాడు. గణేశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఇటీవల చిట్టీ ఎత్తుకుని డబ్బులు చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి గణేశ్‌నగర్‌లోని కమాన్ వద్దగల కాఫీ సెంటర్ వద్ద శ్రీనివాస్ కనిపించడంతో చిట్టీ డబ్బులు చెల్లించాలని అంజయ్య ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా.. శ్రీనివాస్ తన కుమారునికి ఫోన్ చేసి రమ్మన్నాడు. శ్రీనివాస్ కుమారుడు తీవ్ర ఆగ్రహంతో వచ్చి అంజయ్యపై విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అంజయ్యను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయంపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


