డబుల్ ఇళ్లకు వెళ్లేనా
నేటితో గడువు పూర్తి వెళ్లకుంటే ఇళ్ల రద్దు అర్హులైన మరొకరికి కేటాయింపు ఇప్పటికే లబ్ధిదారులకు నోటీసులు
జగిత్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని అర్బన్‌హౌసింగ్ కాలనీలో 4,520 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మూడు విడతల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 4,194 మందికి లక్కీడ్రా ద్వారా ఇళ్లను కేటాయించింది. మున్సిపాలిటీలోని 48వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించారు. ఏడాది గడుస్తున్నా కొందరు ఆ ఇళ్లలోకి వెళ్లడం లేదు. దీంతో అధికారులు వారికి డెడ్‌లైన్ విధించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులందరూ ఈనెల 31లోపు చేరకుంటే వారి అర్హతను రద్దు చేసి మరొకరికి ఇస్తామని అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు.
సుదూరం.. వసతుల లేమి
అర్బన్‌కాలనీ జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతోనే లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో వసతులు సమకూర్చుతామని, లబ్ధిదారులు తప్పకుండా వెళ్లాల్సిందేనని హౌసింగ్ అధికారులు చెబుతున్నా.. అక్కడున్న సౌకర్యాల దృష్ట్యా ఎవరూ ముందుకు రావడంలేదు. జిల్లాకేంద్రంలో అన్ని వసతులు ఉండటం, నిరుపేదల పిల్లలు కూడా ఇక్కడి పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. ఈ క్రమంలో అర్బన్‌కాలనీకి వెళ్తే ఇక్కడి రావడానికి అదనపు భారం పడుతుందని ఆలోచిస్తున్నారు. ఆటోల్లో వెళ్తే సుమారు రూ.100 నుంచి రూ.150వరకు తీసుకుంటున్నారు. రాత్రివేళ వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది.
ఒక్కో ఇంటికి రూ.5.30లక్షలు
నిరుపేదల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5. 30 లక్షల చొప్పున కేటాయించి 4,520 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో వసతుల కల్పనకు ఇటీవల రూ.30 కోట్లు అదనంగా కేటాయించారు. తక్షణ అవసరాలైన డ్రైనేజీ, తాగునీరు, క రెంట్ కల్పించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పైగా దూరం కావడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు అక్కడ బేస్‌మెంట్ వరకు కట్టుకున్నారు. దూర ప్రాంతం కావడంతో వారు కూడా ఎవరూ వెళ్లలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది.
గడువు పెంచేనా..?
డబుల్‌బెడ్‌రూంలు పొందిన లబ్ధిదారులు కచ్చితంగా వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి కూడా లబ్ధిదారులు అక్కడకు వెళ్తేనే బాగుంటుందని పేర్కొంటున్నారు. నేటితో గడువు ముగియడంతో మరికొద్దిరోజులు గడువు పొడగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరో నెల వరకు గడువు పొడిగిస్తే ఆలోపు వెళ్తామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
సామగ్రి దొంగలపాలు
ఇళ్లు దక్కించుకున్న వారు కచ్చితంగా వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచి స్తున్నా.. ఎవరూ ముందుకు కదలడం లే దు. మరోవైపు అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది. అధికారుల మాటలు విని కొందరు వెళ్తున్నా.. చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద నుంచి కాపర్ వైరు, విద్యుత్ వైర్లు, ఇతరత్రా పైపులు, మంచినీటి పైపులు, తలుపులకు సంబంధించిన వస్తువులు దొంగలపాలవుతున్నాయి. లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్తే దొంగల బాధ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
భయం భయం
డబుల్ ఇళ్లకు వెళ్లేనా


