ముందుకు.. వెనక్కి..!
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాల ఈ ఏడాది కూడా ముందకు కదలలేదు. నిధులలేమితో హాస్టల్, లైబ్రరీ వంటివి సంపూర్తిగానే మిగిలిపోయాయి. మూడేళ్లుగా భవన నిర్మాణం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో ఉన్న ఓల్డ్ ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉంది. ఇది జనరల్ ఆస్పత్రికి నిత్యం అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. మరమ్మతు చేపట్టకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ప్రారంభమైంది. త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 50 పడకలతో నిర్మితమైన క్రిటికల్ కేర్ భవనం ఇంకా ప్రారంభోత్సవం కావడం లేదు. క్రిటికల్ కేర్ ప్రారంభమైతే రోగులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది.
విద్యకు పెద్దపీట..
జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం మంజూరుతోపాటు, ఇటీవల నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. పొలాసలో గతంలో ఏర్పాటైన వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేశారు. ఎంతోమంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేస్తున్నారు. కోరుట్లలో ఇప్పటికే వెటర్నరీ కళాశాల ఉండటంతో ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.
ఆలయాల అభివృద్ధి..
జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నృసింహస్వామి ఆలయాలున్నాయి. గోదావరి ప్రాంతం కావడంతో 2027లో జరిగే పుష్కరాలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేరోజు లక్ష మంది పుష్కరస్నానాలు ఆచరించేలా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధికి అంచనాలు రూపొందించారు. గత ప్రభుత్వంలో కొండగట్టు, ధర్మపురి, వెల్గటూర్ ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. తాజాగా కొండగట్టుకు టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో రూ.35.19 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీపై నీలినీడలు
జిల్లాలో ప్రధానంగా చెరుకు పంట పండిస్తుంటారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన రుణభారం వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.190 కోట్లు తీర్చింది. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల మామిడితోటలు కలిగి ఉండగా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మామిడి ఎగుమతి జరుగుతుంది. అలాగే వరి మూడు లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. సారంగాపూర్ మండలంలో రోల్లవాగు ఆధునీకరణకు రూ.130 కోట్లు మంజూరయ్యాయి. పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వద్ద ఏర్పాటు సదర్‌మాట్ పూర్తిస్థాయిలోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇది అందుబాటులోకి వస్తే 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే కథలాపూర్ మండలంలో సూరమ్మ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
మండలాల్లో పక్కా భవనాలెప్పుడు..?
జిల్లాలో గతంలో 18 మండలాలు ఉండగా కొత్తగా రెండు మండలాలను చేర్చారు. వీటికి పక్కా భవనాలు లేకపోవడంతో కార్యాలయాలకు ఇబ్బందికరంగా మారింది.
మున్సిపాలిటీలకు అత్యధిక నిధులు
ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది. పనులను జరుగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, రాయికల్‌కు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటిల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ గతంలో అమలైనప్పటికీ గొడవలతో నిలిచిపోయింది. మళ్లీ అధికారులు ఆ దిశగా ప్రారంభించడం లేదు. ఇరుకు రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యావర్‌రోడ్ ఇరుకుగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
డబుల్‌బెడ్‌రూంలు సిద్ధం
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా జగిత్యాలలోనే 4520 బెడ్‌రూంలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇటీవల అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. అందులో వసతులు లేక వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈనెల 31వరకు ఇళ్లలోకి వెళ్లకుంటే వారి పట్టాను రద్దు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
కొలువుదీరిన సర్పంచులు
జిల్లాలో 385 గ్రామపంచాయతీల్లో సర్పంచులు కొలువుదీరారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడింది.
అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల
ముందుకు.. వెనక్కి..!
ముందుకు.. వెనక్కి..!


