ముక్కోటి మొక్కులు..
మల్యాల: శ్రీవేంకటేశ్వరస్వామికి పూజలు చేస్తున్న కలెక్టర్ దంపతులు
వాల్గొండలోని ఆలయ గర్భగుడిలో కొలువుదీరిన
శ్రీ రామలింగేశ్వరస్వామి
కోరుట్ల: అష్టలక్ష్మీ దేవాలయంలో..
ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తున్న
స్వాములను వీక్షిస్తున్న భక్తులు
జగిత్యాల/కోరుట్ల/ధర్మపురి/జగిత్యాలటౌన్/మల్యాల/మల్లాపూర్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాకేంద్రంలో ని ధరూర్ క్యాంపులోగల శ్రీకోదండరామాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, బ్రాహ్మణవాడలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సందడి నెలకొంది. కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో శ్రీవేంకటేశ్వరస్వామి, భూదేవి, శ్రీదేవి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. కలెక్టర్ సత్య ప్రసాద్ దంపతులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ఆర్డీవో మధుసూదన్, ఈఓ శ్రీకాంత్‌రావు, తహసీల్దార్ వసంత పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం వాల్గొండలోగల శ్రీరామలింగేశ్వర త్రికూటాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 7.40గంటలకు శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించారు. భక్తులు తన్మయత్వంతో పులకరించిపోయారు. జిల్లా కేంద్రంలోని టవర్‌సర్కిల్‌లోగల శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో మహతికృష్ణ శ్రీవేంకటేశ్వరస్వామి వేషధారణతో ఆకట్టుకున్నారు. కోరుట్ల పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టలక్ష్మీ ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు, ఆర్డీవో జివాకర్‌రెడ్డి, సీఐ సురేష్ బాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల అధ్యక్షులు యతిరాజం నర్సయ్య, బూరుగు రామస్వామి, ధర్మకర్తలు పాల్గొన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పవేదికపై మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేతుల మీదుగా ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం సమయంలో మువ్వురు స్వాములను పురవీధుల మీదుగా అశేష భక్తజనం మధ్య శోభాయాత్ర చేపట్టారు. స్వామివార్లను కలెక్టర్ సత్యప్రసాద్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు.
ముక్కోటి మొక్కులు..
ముక్కోటి మొక్కులు..


