తొలివిడత పోలింగ్‌కు సిద్ధం
జగిత్యాల: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 122 గ్రామపంచాయతీల్లో ఓటింగ్ జరగనుంది. మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. సామగ్రితో సిబ్బంది ఆయా గ్రామాలకు తరలివెళ్లారు. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ పకడ్బందీ నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు.
భారీ బందోబస్తు
మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు విధులు కేటాయించారు. ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను నియమించారు.
గ్రామాల్లో సందడి.. మొదలైన పంపకాలు
తొలిదశ ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో అధికారికంగా ప్రచారం ముగిసినప్పటికీ కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్‌పై రాత్రి నుంచే గ్రామాల్లో జోరందుకుంది. మొదటి విడత ఏడు మండలాల్లోని 122 గ్రామ పంచాయతీల్లో తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ రంగంలో ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రతి ఓటరును కలుస్తున్నారు.
పొరపాట్లు జరగనీయొద్దు:
కలెక్టర్ సత్యప్రసాద్
మల్లాపూర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షప్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలను సజావుగా జరిపించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారించుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు సరఫరా ఉండేలా చూడాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
సామగ్రితో గ్రామాలకు తరలిన సిబ్బంది
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్
రెండు గంటల నుంచి కౌంటింగ్.. ఫలితాల ప్రకటన
మండలాలు : మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్న మల్లాపూర్
పంచాయతీలు : 122
వార్డులు : 1172
పోలింగ్ కేంద్రాలు : 1172
ఓటర్లు : 2,20,147
వోపీవోలు : 2005
బ్యాలెట్ బాక్స్‌లు : 1406
తొలివిడత పోలింగ్‌కు సిద్ధం
తొలివిడత పోలింగ్‌కు సిద్ధం


