పంచింగ్ స్టార్ట్
ముగిసిన తొలి విడత ప్రచారం
369 గ్రామాల్లో మూగబోయిన మైకులు
20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
మొదలైన ప్రలోభాల పర్వం
డబ్బులు, మద్యం, యూపీఐతో ఓటర్లకు వల
డబ్బులు, మద్యం, యూపీఐతో ఓటర్లకు వల
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు
కరీంనగర్ 92 03 89
పెద్దపల్లి 99 04 95
సిరిసిల్ల 76 09 67
జగిత్యాల 122 04 118
మొత్తం 389 20 369
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు.
తొలి విడతలో 369 జీపీలకు
ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్‌లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం.
కొరవడిన నిఘా
ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.
మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్‌కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


