ఇంటర్నల్స్ వాయిదా
పీజీ పరీక్షలు రీ షెడ్యూల్
దిగొచ్చిన ఎస్‌యూ వీసీ.. నెరవేరిన విద్యార్థుల డిమాండ్లు
సెట్, నెట్ నేపథ్యంలో వాయిదా పడిన సెమిస్టర్స్
మూడో సెమిస్టర్ పరీక్షలు సంక్రాంతికి ముందు కొన్ని.. తరువాత కొన్ని
ఎల్‌ఎల్‌బీ విద్యార్థులకు హాస్టల్ కల్పించలేమన్న వీసీ
మధ్యాహ్నం 3 గంటల వరకు లైబ్రరీలోకి నోఎంట్రీ
హాస్టల్ కేర్ టేకర్స్ ఫిర్యాదుపై స్పందించని అధికారులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు రెండు రోజులుగా చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు సద్దుమణిగింది. వర్సిటీ ఉన్నతాధికారుల తీరుతో తాము నష్టపోతున్నామంటున్న విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించడంతో శాంతించారు. ఐదు డిమాండ్లతో మొదలైన ఆందోళనలో రెండు ప్రధానమైనవి ఆమోదించడం, మిగిలినవాటిపై హామీ దక్కకపోవడంతో విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమను ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా....ఇంటర్నల్స్, 3వ సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ చేస్తూ చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలుత సైన్స్ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ కాసేపు రిజిస్ట్రార్‌తో మాట్లాడారు. రిజిస్ట్రర్ నుంచి స్పందన లేకపోయే సరికి డప్పులు కొడుతూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట మరోసారి ధర్నాకు పూనుకున్నారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ బైఠాయించడంతో వీసీ ఉమేశ్ కుమార్ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు.
సంక్రాంతి ముందు కొన్ని... తరువాత కొన్ని
విద్యార్థుల ఆందోళనతో చర్చల దిగొచ్చిన వీసీ సుమారు గంటన్నర సేపు వారితో చర్చలు జరిపారు. వీసీతోపాటు రిజిస్ట్రార్ రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత చర్చల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షలను సంక్రాంతి పండుగకు ముందు కొన్ని, తరువాత కొన్ని నిర్వహించేలా షెడ్యూల్‌లో మార్పులు జరిపేందుకు సరే అన్నారు. నెట్, సెట్‌కు సన్నద్ధమవుతున్న వారికి సెమిస్టర్ పరీక్షలు అవే తేదీల్లో వస్తుండటాన్ని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెట్, సెట్ రాసే విద్యార్థులకు వీలుగా షెడ్యుల్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
లైబ్రరీపై పట్టు
యూనివర్సిటీలో 24 గంటల లైబ్రరీ సదుపాయంపై వీసీ పట్టు వీడలేదు. మధ్యాహ్నం తరువాతే లైబ్రరీలోకి అనుమతిస్తామని, కావాల్సిన వారు ఎన్ని పుస్తకాలైనా తీసుకెళ్లి చదువుకోవచ్చని స్పష్టంచేశారు. అంతకుముందు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో 24 గంటలు లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అలాంటి వెసులుబాటును శాతవాహన కల్పించాలని కోరారు. యూనివర్సిటీలోని మెస్ విషయంలో కేర్ టేకర్స్ పట్టించుకోవడం లేదని, మెస్‌లో సరిపడా సిబ్బంది లేరన్న విద్యార్థుల వాదనను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎల్‌ఎల్‌బీ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసినా దానిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విద్యార్థులు లైబ్రరీ, లా విద్యార్థులకు హాస్టల్ విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు.
యుజీసీ నెట్, సెట్ పరీక్షలకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అందుకే పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం.
– వీసీ ఉమేశ్ కుమార్


