పోలింగ్ ఏజెంట్లే కీలకం
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఏజెంట్లు కీలకం కానున్నారు. వీరు అప్రమత్తంగా ఉంటేనే అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుంది. సర్పంచ్, వార్డుసభ్యుడిగా పోటీచేస్తున్న ప్రతి వ్యక్తి.. ప్రతి పోలింగ్ కేంద్రానికో ఏజెంట్‌ను నియమించుకోవాలి. ఓటేసేందుకు వచ్చే ప్రతి ఓటరును గుర్తించేది ఏజెంట్లే కావడంతో కీలకమైన వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకోవాల్సిన అవసరముంది. సర్పంచ్ అభ్యర్థి ప్రతివార్డు నుంచి అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. వార్డుసభ్యుడు కూడా అదే వార్డుకు సంబంధించిన ఓటరును ఏజెంట్‌గా నియమించుకోవాలి. ఏదైనా కారణాలతో ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ముందే ఫిర్యాదు చేసుకోవాలి. దానిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి అనుమతి ఇస్తే తప్ప ఇతరులను నియమించుకునేందుకు వీలు లేదు.
దొంగ ఓట్లు గుర్తించేది ఏజెంట్లే
ప్రతి వార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటరు వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది ముందుగా వారి ఓటరు క్రమ సంఖ్యతోపాటు అతని పేరు, తండ్రి పేరును ఏజెంట్లకు వివరిస్తారు. ఏజెంట్లు అంగీకరించినప్పుడే ఓటరుకు వేలుపై ఇంక్ పెట్టి బ్యాలెట్ పేపర్లు అందిస్తారు. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన తర్వాత ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల అధికారి దానిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ప్రతి ఓటరును నిజమైన ఓటరుగా ఏజెంట్లు గుర్తించినప్పుడే ఎన్నికల సిబ్బంది ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిస్తారు. ఎవరైనా ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో నిగ్గు తేల్చిన తర్వాతే ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
ఏజెంట్ల వివరాలు రిటర్నింగ్ అధికారికి పంపాలి
సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థి స్క్రూటినీ పూర్తి కాగానే ఓ వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకునే అవకాశం ఉంటుంది. ఏజెంట్‌గా నియమించుకునే వ్యక్తి తన అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా డూప్లికేట్ కాపీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించాలి. పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి నియామక పత్రంపై ఆమోదం తెలుపుతూ సంతకం చేసి ఒక కాపీని ఏజెంట్‌కు అందజేస్తారు.
కౌంటింగ్‌కు ఏజెంట్ల నియామకం
ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో మొదట వార్డుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుని కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ ఏజెంట్‌గా వచ్చేవారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఏదైనా నామినేటెడ్ పదవి నిర్వహించి ఉండరాదు. పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పదవిలో ఉన్న కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఏదైనా జాతీ య, రాష్ట్ర జిల్లా కో–ఆపరేటీవ్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యులు ఏజెంట్లకు అనర్హులు. వీరిని తప్ప ఎవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు.


