బంధుగణం.. శత్రువర్గం
బరిలో నిలిచిన మామఅల్లుళ్లు, తోడికోడళ్లు పోటీకి సై అంటున్న తల్లీకొడుకులు, అత్తాకోడళ్లు గ్రామాల్లో ఎక్కడ చూసినా సందడే సందడి.. రసవత్తరంగా పంచాయతీ పోరు
పోటీలో ఎక్కువగా అన్నదమ్ములు
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బంధువులే చాలాచోట్ల బరిలో నిలుస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో తల్లీకొడుకులు, అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, తోడికోడళ్లు, అన్నదమ్ములు పోటీకి సై అంటున్నారు. ‘అన్న ఈసారి తప్పుకోరాదే.. నేను నిలబడుతున్న. నాకు మద్దతివ్వు..’ అంటూ ఓ తమ్ముడు అన్నను బతిమిలాడినా.. ‘లేదు తమ్మీ ఈసారి నువ్వే తప్పుకో.. నాకు మద్దతు ఇవ్వు..’ అంటూ అన్న బుజ్జగించినా.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో గ్రామాల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. బంధువులే శత్రువర్గంలా మారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల తోటికోడళ్లు బరిలో నిలబడగా.. బంధువుల సమక్షంలో పంచాయితీలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రిజర్వేషన్లు మళ్లీ అనుకూలిస్తాయో..? లేదో..? అన్న ఉద్దేశంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. బంధువుల మధ్య లొల్లి ఇతరులకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు ఓటర్లను చీల్చుకుంటే మధ్యలో నిలబడిన వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎక్కడ చూసినా ఇదే చర్చ
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా బంధువుల మధ్య జరుగుతున్న పోరుపై చర్చ కొనసాగుతోంది. అన్నదమ్ములు, తోటికోడళ్లు చాలాచోట్ల పోటీలో నిలబడడంతో శత్రువులుగా మారుతున్నారు. ఒకే ఇంటినుంచి ఇద్దరు నిలబడటంతో బంధువులకే తలనొప్పిగా మారింది. ఎవరికి ఓటు వేయాలి..? ఓటు వేయకపోతే ఏమనుకుంటారో అని చర్చించుకుంటున్నారు. గెలిచిన వారు సంతోషంగా ఉన్నా.. ఓడిన వారు బంధువులపై శత్రుత్వం పెంచుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే చెరి రెండు ఓట్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హోరందుకున్న ప్రచారం
పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం హోరందుకుంది. జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు 11న జరగనుండగా రెండో విడత 14న, మూడో విడత 17న నిర్వహించనున్నారు. మొదటి, రెండో విడత అభ్యర్థుల జాబితా ఖరారైంది. మూడో విడత ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉండనున్నారో తెలియనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన అనంతరం కచ్చితంగా పోటీలో ఉంటామన్న అభ్యర్థులు మాత్రం ప్రచారం జోరుగా చేస్తుండగా కొందరు నామినేషన్లు ఉపసంహరించుకునే వారు ఆచీతూచి అడుగు వేస్తున్నారు.
రెబల్స్‌తోనే బెడద
పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేకున్నా.. ఆయా పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు ఒకే గ్రామంలో ఇద్దరుముగ్గురు బరిలో ఉండడం ఇబ్బందికరంగా మారింది. అలాగే స్థానికంగా పేరున్న వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. పార్టీకంటే వ్యక్తిని చూసే ఓటు వేసే అవకాశం ఉండడంతో ఎవరికివారు ప్రచార వేగం పెంచారు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపే నాయకుల వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.
సాయంత్రం విందులు
ఓటర్లను ఆకర్షించేందుకు కొంతమంది విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. రెండు విడతల్లో అభ్యర్థుల జాబితా పూర్తి కావడంతో ప్రచారంతోపాటు విందులు మొదలయ్యాయి. నిత్యం ఉదయం అభ్యర్థి వెంట 10 మంది వరకు ఉంటున్నారు. వీరందరికీ అభ్యర్థులే చాయ్‌లు, టిఫిన్లు పెట్టించాల్సి వస్తోంది. ఇక సాయంత్రం విందులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావడంతో ఎవరూ వెనక్కి తగ్గకుండా ప్రచారంలో మునిగిపోతున్నారు.
ఒక వైపు చలి.. మరో వైపు ప్రచారం
రెండు రోజులుగా విపరీతంగా చలి పెడుతున్నప్పటికీ అభ్యర్థులు ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు. ఉదయం 6 గంటలలోపే ఇంటింటికీ చేరుతూ ఓటు తమకే వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
బంధుగణం.. శత్రువర్గం
బంధుగణం.. శత్రువర్గం
బంధుగణం.. శత్రువర్గం
బంధుగణం.. శత్రువర్గం


