శిథిలావస్థలో కోరుట్ల కోట బురుజులు
మహాదేవస్వామి ఆలయ దారిలో దెబ్బతిన్న కోట బురుజులు
కోరుట్ల పట్టణంలోని ఆరు కోట బురుజులు శిథిలావస్థకు చేరాయి. జైనులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, రాష్ట్ర కూటులు ఇక్కడ కోట నిర్మించుకుని ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు కోట చుట్టూ ఆరు బురుజులు నిర్మించారు. ఆరు బురుజులను కలుపుతూ పెద్ద గోడ ఉండగా.. కాలక్రమేణ పూర్తిగా దెబ్బతిని కనుమరుగైంది. ఆరు బురుజులు కూడా శిథిలావస్థకు చేరుతున్నాయి. కోరుట్ల చరిత్రకు సజీవంగా నిలిచే కోటప్రదేశం, బురుజుల సంరక్షణపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పురావస్తు అధికారులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదనే విమర్శలున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమృత్ ఉత్సవాల్లో భాగంగా పట్టణ యువకులు కోట బురుజులకు రంగులు వేసి.. అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి. బురుజుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొందరు కబ్జా చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి బురుజులను కాపాడాలని, వాటికి పూర్వ వైభవం తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. – కోరుట్లటౌన్
శిథిలావస్థలో కోరుట్ల కోట బురుజులు
శిథిలావస్థలో కోరుట్ల కోట బురుజులు


