‘పరీక్ష’ వాయిదా వేయాలె
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. ఈనెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పీజీ 3వ సెమిస్టర్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేష న్ ఆఫీస్ ఎదుట సుమారు ఆరుగంటలపాటు బైఠాయించారు. సోమవారం వర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు సుమారు 600 మంది వర్సిటీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ర్యాలీగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. త్వరలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతున్నారని, ఎన్నికలకు ఓటు వేసి రావాలంటే ఇబ్బంది అవుతుందని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈనెల 23 నుంచి జవరి 7వ తేదీ వరకు సెట్, నెట్ పరీక్షలు ఉన్నాయని, ఏళ్లకాలం నుంచి ఎదురుచూస్తే ఇప్పుడు షెడ్యూల్ విడుదల అయ్యిందని, ఇదే సమయంలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే.. సెట్, నెట్‌కు సన్నద్ధం అవడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15,16న నిర్వహించే ఫస్టియర్ విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలోని లైబ్రరీని ఉదయం 9 గంటల వరకే మూసేస్తున్నారని, సాయంత్రం తక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఏ వర్సిటీలోనూ లైబ్రరీలు మూసివేసిన దాఖలాలు లేవని కేవలం శాతవాహనలోనే మూసివేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే బైటాయించిన విద్యార్థులు మధ్యాహ్న సమయంలో అక్కడికే భోజనం తెప్పించుకుని తిన్నారు. వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోగా... విషయం తెలుసుకున్న సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మంగళవారం మాట్లాడుదామని వర్సిటీ రిజిస్ట్రార్ ఓఎస్‌డీ ద్వారా ఫోన్లో చెప్పడంతో ఆందోళన వాయిదా వేశామని శాతవాహన స్టూడెంట్ జేఏసీ నాయకులు తెలిపారు.


