కొనుగోళ్లు ముగుస్తున్నా అందని పైకం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నప్పటికీ రైతుల ఖాతాల్లో రూపాయి జమ చేయలేదు. మొక్కజొన్న కొనుగోలుకు జిల్లాలో 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటికే 10కేంద్రాలు మూసివేశారు. కథలాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి, మల్లాపూర్ కేంద్రాలకు అంతంతమాత్రంగా మక్కలు వస్తున్నాయి. ఈ కేంద్రాలు కూడా నేడో, రేపో మూసివేస్తున్నారు. మొక్కజొన్న పంట అమ్మి, దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. డబ్బులు ఇప్పటికీ వేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఎదుట రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
2.43 లక్షల క్వింటాళ్ల కొనుగోలు
దీపావళి నుంచి ఇప్పటివరకు 7,577 మంది రైతుల నుంచి 2.43 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నారు. దీని ప్రకారం రైతులకు దాదాపు రూ.58.49 కోట్లు రావాల్సి ఉంది. పంట అమ్మి నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు నిధులు మంజూరు చేయలేదని, రాగానే రైతులకు చెల్లిస్తామని అధికారులు చెపుతున్నారు.
దిక్కులు చూస్తున్న రైతులు
ఎక్కువగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్ మండల రైతులు మార్క్‌ఫెడ్‌కు మక్కలు అమ్మారు. ప్రభుత్వ ధరకు విక్రయించామని సంబరపడాలో..? లేక డబ్బులు ఇంకా రాలేవని బాధపడాలో రైతులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న పంట డబ్బులు వస్తే యాసంగి పంటల సాగుకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే డబ్బులు రాకపోయే ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.
మక్కలు అమ్మిన పైసల కోసం రైతుల ఎదురుచూపులు
జిల్లా రైతులకు రూ.58.49 కోట్లు బకాయి
14 కేంద్రాల ద్వారా 2.43 లక్షల క్వింటాళ్ల కొనుగోలు
కేంద్రం కొన్నది రావాల్సినడబ్బులు
(క్వింటాళ్లలో) (రూ.లలో)
మెట్‌పల్లి 59,272 రూ.14.22కోట్లు
ఇబ్రహీంపట్నం 52,604 రూ.12.62కోట్లు
మల్లాపూర్ 38,346 రూ.9.20కోట్లు
రాయికల్ 19,008 రూ.4.56కోట్లు
కోరుట్ల 16,027 రూ.3.8కోట్లు
కథలాపూర్ 11,990 రూ.2.87కోట్లు
జగిత్యాల 11,532 రూ.2.76కోట్లు
భీమారం 9,974 రూ.2.39కోట్లు
లక్ష్మీపూర్ 7,331 రూ.1.75కోట్లు
మేడిపల్లి 6,184 రూ.1.48కోట్లు
డబ్బా 4,257 రూ.1.02కోట్లు
గొల్లపల్లి 3,446 రూ.82.71 లక్షలు
ధర్మపురి 1,910 రూ.45.84 లక్షలు
గంభీర్‌పూర్ 1,826 రూ 43.82 లక్షలు


