యాసంగిలో అనువైన వరి రకాలివే..
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్‌లో జిల్లాలో వరి ప్రధాన పంటగా మారనుంది. కనీసం 3.10 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు అవసరమైన, వరి నారుమడులు పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. ఆయా ప్రాంతాల సాగునీటి వసతిని బట్టి దీర్ఘకాలిక (140–150 రోజులు), మధ్యకాలిక(140–130 రోజులు), స్వల్పకాలిక(130–120 రోజులు) రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. యాసంగిలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడక్కడ సన్న రకాలు సాగు చేయాలని చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనిలతో ఒప్పందాలు చేసుకుని వరిలో ఆడ, మగ విత్తనాలను సాగు చేసుచేస్తున్నారు.
దొడ్డు రకాల్లో ప్రధానమైనవి
కేఎన్‌ఎం–118 (కూనారం సన్నాలు), జేజీఎల్–18047 (బతుకమ్మ), జేజీఎల్–24423(జగిత్యాల రైస్–1), ఆర్‌ఎన్‌ఆర్–29325, ఎంటీయూ–1010 రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలు దిగుబడి ఎకరాకు 28–32 క్వింటాళ్ల వరకు వస్తుంది. చలి, సుడిదోమను తట్టుకుంటాయి. జిల్లాలో పంటకాలం తక్కువగా ఉండే రకాలను సాగు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సన్న రకాల్లో ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, డబ్ల్యూజిఎల్–962 రకాలు ప్రధానమైనవి. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కొన్ని రకాలు ఒక్క ప్రాంతంలో అధిక దిగుబడినిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి ఇవ్వవు. రైతులు వరి విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడిలోనే పంటకు అవసరమైన అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్ల, పురుగుల బెడద ఉండదు. చలికాలంలో నారు పెంపకం సమయంలో భాస్వరం ఎక్కువగా ఇస్తూ... ఉదయం వేళల్లో నీటిని అందిస్తూ ఉండాలి. నారు పోసిన 25 రోజుల లోపల నాటేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.


