● ఇక ఉపసంహరణలే..
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఇక ఉపసంహరణలే మిగిలాయి. ఇప్పటికే మొదటి విడత ఉపసంహరణలు పూర్తయి, రెండో విడత నేటితో పూర్తి కానుంది. ఇక మూడో విడత ఈనెల 9న ఉంది. ఇప్పటికే ప్రతీ గ్రామంలో ఒక్కో సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక స్థానం నుంచి దాదాపు 5–6 మంది పోటీ చేస్తున్నారు. మూడో విడతకు సంబంధించి ఉపసంహరణలకు సమయం ఉండటంతో ఇక బుజ్జగింపులకు తెరలేపుతున్నారు. బేరసారాలు ఆడుతున్నారు.
సంప్రదింపులు, రాయబారాలు
మూడో విడతకు చెందిన అభ్యర్థులు రెబల్స్‌ను సంప్రదింపులు, రాయబారాలు జరుపుతున్నారు. ఎలాగైనా తప్పుకోవాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ప్రతీ పార్టీలో ఒకటి నుంచి ఇద్దరు రెబల్స్ ఉండటంతో పార్టీ నేతలతో ఒత్తిడి తెస్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రెబల్స్‌నైనా తప్పిస్తే గెలుపుపై ఆశలు ఉంటాయని ఆశావహులు అంచనాలు వేస్తున్నారు. కొందరు గ్రామ పెద్దలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వినని వారు ఉపసంహరణ అయ్యేంత వరకు ఎవరికీ దొరక్కకుండా వెళ్తున్నారు.
రసవత్తరంగా ఎన్నికలు
గ్రామపంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. జిల్లాలో 385 గ్రామపంచాయతీలకు, 3,536 వార్డు సభ్యుల పదవుల కోసం భారీగా నామినేషన్లు రాగా, గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. ఈసారి వార్డు సభ్యులకు సైతం అత్యధికంగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. రెబల్స్‌ను బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రిజర్వేషన్లు అనుకూలించక ఈసారి మాకే కావాలంటూ మొండికేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా పంచాయతీ ఎన్నికలను తీసుకున్నందున గ్రామాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. గ్రామాల్లో బలమైన నాయకునికి మద్దతు ఇవ్వాలని, రెబల్స్‌ను తప్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ చాలా గ్రామాల్లో నువ్వా? నేనా? అన్నట్లు పోటీ జరుగుతోంది.
వ్యూహాలు
పోటీ అనివార్యం అయిన చోట ఎలా గెలవాలన్న దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. మూడు విడతల్లో జరుగుతున్నా మొదటి, రెండు విడతలకు పెద్దగా సమయం లేనప్పటికీ మూడో విడతకు మాత్రం వారంకు పైగా సమయం ఉండటంతో ఎలాగైనా గెలవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చులకు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొందరు పలు చోట్ల విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఓట్లు ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.


