ఏకగ్రీవం.. వివాదం
● ఆర్డీవో కార్యాలయం ఎదుట యామాపూర్ గ్రామస్తుల ఆందోళన
● వీడీసీ బలవంతంగా అభ్యర్థిని తప్పించిందని ఆగ్రహం
● ఎన్నిక జరపాలంటూ అధికారులకు విజ్ఞప్తి
మెట్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీ) సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న తీరు వివాదాస్పదమవుతోంది. గ్రామస్తుల అభిప్రాయాలను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం వేసిన వీడీసీపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో ఓ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్‌ను విత్ డ్రా చేయించి.. ఎన్నిక లేకుండా చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం మెట్‌పల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
కలెక్టర్‌కు నివేదిక అందించాం
యామాపూర్‌లో గోపాల్‌రెడ్డి నామినేషన్ విత్ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు అందించాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ఆర్డీవో


