నేడు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రశాంతం

Dec 5 2025 6:07 AM | Updated on Dec 5 2025 6:07 AM

నేడు ప్రశాంతం

నేడు ప్రశాంతం

నాడు సమస్యాత్మకం..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడు దశాబ్దాల క్రితం సిరిసిల్ల మానేరు ప్రాంతంలో ఎన్నికలు అంటేనే గ్రామీణుల్లో భయాందోళన ఉండేది. ఒక వైపు పోలీసుల ప్రచారం.. మరో వైపు నక్సలైట్ల అల్టిమేటంతో పల్లెల్లో భయానక వాతావరణం ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు పల్లెజనం ముందుకొస్తున్నారు.

బహిష్కరణ పిలుపుతో భయాందోళన

మూడు దశాబ్దాల క్రితం ఎన్నికలు వచ్చిందంటే సిరిసిల్ల ప్రాంతంలో ఒక రకమైన భయానక పరిస్థితులు ఉండేవి. ఒక వైపు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని నక్సలైట్లు దర్బార్‌లు పెట్టి పిలుపునిచ్చేవారు. గోడలపై రాతలతో హెచ్చరించేవారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు జనాన్ని పోలింగ్‌ కేంద్రాలకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకునేవారు. అయినా చాలా మంది గ్రామీణులు ఓటు వేసేందుకు వెనుకంజ వేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నక్సలైట్లు మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా నిలుచుండేవారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణులు సైతం ఓటుహక్కు వినియోగించుకునేవారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కు వస్తే ఓటు వేసేందుకు జంకేవారు. ఆ కాలంలో పంచాయతీ ఎన్నికల్లో 65 నుంచి 68 శాతం పోలింగ్‌ నమోదయ్యేది. అదే ఇప్పుడు 73 నుంచి 78 శాతం వరకు నమోదవుతుంది.

బ్యాలెట్లు మాయం

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో 1995 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు బ్యాలెట్‌బాక్స్‌లను అపహరించుకు వెళ్లారు. అయితే తర్వాత పోలీసుల విచారణలో గ్రామంలోని ఓ మిలిటెంట్‌ వద్ద ఉంచినట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో అప్పటి ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామంలో పోలింగ్‌అధికారులను బెదిరించడమే కాకుండా బ్యాలెట్‌బాక్స్‌ల్లో సిరాను పోసి ఎన్నికలను డిస్టర్బ్‌ చేశారు. అదే ప్రాంతంలోని కంచర్ల గ్రామంలో కొందరు రిగ్గింగ్‌ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

స్వేచ్ఛగా ఎన్నికలు

కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ సిరిసిల్ల ఏరియాలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పోలీసులు తీసుకున్న అవగాహన చర్యలు, నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. గ్రామీణుల్లో ఆర్థిక అక్షరాస్యత.. ఉన్నత విద్యావంతులు పెరిగిపోవడంతో రాజ్యాంగహక్కులపై అవగాహన పొందారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో పల్లె ప్రజలు ఉన్నారు. దీంతో ఒకప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పేరొందిన దుమాల, అడవిపదిర, కంచర్ల, వీర్నపల్లి, మద్దిమల్ల, తిమ్మాపూర్‌, గుంటపల్లిచెరువుతండా, బుగ్గరాజేశ్వరతండా, వట్టిమల్లతండా, బండమీదితండా, కేలోత్‌తండా, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట, ఎగ్లాస్‌పూర్‌, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చాలా గ్రామాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉండేది. కానీ నేడు ఆ గ్రామాలే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్‌ నమోదు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మూడు దశాబ్దాల క్రితం నక్సల్స్‌ మాటే వేదం

నేడు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి

మారిన గ్రామీణ పరిస్థితులు

ఎన్నికల్లో పోటాపోటీగా బరిలోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement