మహిళలదే తీర్పు..
జగిత్యాల: జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నారు. ప్రతి మండలంలో వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. పొదుపు మహిళా సంఘాలు లక్షకు పైగా ఉండటంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వారు మద్దతిస్తే విజయం ఖాయమనే భావనతో మహిళాసంఘాల చుట్టూ తిరుగుతున్నారు. గెలిస్తే ఏం చేస్తామన్న హామీలు కూడా ఇప్పటినుంచే ఇస్తున్నారు.
మహిళాసంఘాలకు ఆఫర్లు
జిల్లాలో ఓటర్లు 6,07,263 మంది ఉండగా.. పురుషులు 2,89,702 మంది, మహిళలు 3,17,552 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన మహిళా ఓటర్లు 27,850 మంది అధికంగా ఉన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారు ఎటువైపు మొగ్గుచూపితే వారు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో అభ్యర్థులు మహిళా సంఘాలకు ఆఫర్లు ఇస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామని, వ్యాపారాలకు కృషి చేస్తామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
రాయికల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి, రెండోదశ పోరుకు నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఉపసంహరణ కూడా ముగిసిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో డబ్బులు సమకూర్చుకునే పనిలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. పార్టీల నుంచి బీఫాం ఇచ్చే అవకాశం ఉంటే కొంతవరకై నా ఫండ్ వచ్చేదని, పార్టీలకు సంబంధం లేకపోవడంతో ఖర్చులన్ని ఎలా భరించాలోనని అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆస్తుల తాకట్టు.. చిట్టీల లిఫ్టింగ్
జిల్లాలో మొదటి విడత ఈనెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డబ్బులు సమకూర్చుకునేందుకు ఉన్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నారు. మరికొందరు నెలనెలా వేసుకుంటున్న చిట్టీలను లిఫ్ట్ చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మాంసం వంటివి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఖర్చులు తడిసిమోపెడవుతాయి. తమ ప్యానల్ వార్డుసభ్యులు గెలిచేందుకూ తమవంతుగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అభ్యర్థులకు మరింత భారంకానుంది. ఇప్పటికే వాడవాడలా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళలకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ లెక్కన ఎన్నికలు పూర్తయ్యే వరకు చిన్న పంచాయతీలో కూడా ఖర్చు తడిసిమోపెడు కానుంది.
బిల్లులు రాక ఇబ్బందుల్లో ‘మాజీ’లు
మాజీ సర్పంచులకు గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అప్పులపాలయ్యారు. అయినప్పటికీ ఈసారి కూడా సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రూ.లక్షల్లో అప్పు చేసేందుకు వెనుకాడడం లేదు. ఖర్చులతో కూడుకున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటారో.. లేక గెలిస్తే పెట్టిన ఖర్చును మర్చిపోయి సంబరపడతారో వేచి చూడాల్సిందే..
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులకు ఆర్వో, ఏఆర్వో విధులు కేటాయించారు. చాలామంది విధులకు హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ 15 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.
రాయికల్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, సీఆర్పీలు, రిసోర్స్ పర్సన్లు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. వీరంతా సాధారణ పౌరుల్లాగా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలిగానీ.. ఏ సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసినా.. ఎన్నికల కమిషన్‌కు సాక్ష్యాలతో నిరూపిస్తే వారి ఉద్యోగాలపై వేటు పడుతుంది.
జగిత్యాల: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎన్నికల అబ్జర్వర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం ఎంసీసీ కంట్రోల్‌రూమ్‌ను పరిశీలించారు. ఫిర్యాదుల రిజిస్టర్లు, డాక్యుమెంటేషన్, రియల్‌టైం మానిటరింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తున్నాయా..? లేదా..? చూశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, నోడల్ అధికారి నరేశ్ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నా రు. కలెక్టర్, ఎస్పీలతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టామని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా సమాచారం
మండలాలు : 20
గ్రామపంచాయతీలు : 385
వార్డులు : 3,536
ఓటర్లు : 6,07,263
పురుషులు : 2,89,702
మహిళలు : 3,17,552
ఇతరులు : 9
అభ్యర్థుల్లో ఖర్చుల భయం..
15 మంది ఆర్వో, ఏఆర్వోలకు మెమోలు?
ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వేటే..
‘కంట్రోల్‌రూమ్’ ఫిర్యాదులు పరిష్కరించాలి
మహిళలదే తీర్పు..
మహిళలదే తీర్పు..
మహిళలదే తీర్పు..


