అనుమతి ఉంటేనే ప్రచారం
పోలింగ్ కేంద్రాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి
జగిత్యాల: జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రెండోవిడత నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. ప్రచారానికి అతితక్కువ వ్యవధి మాత్రమే ఉండడం అభ్యర్థులకు కొంత ఇబ్బందిగా మారింది. పైగా ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలకు తహసీల్దార్, పోలీస్‌స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే ప్రచారం నిషేధం. ప్రచారానికి ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థికై ఒక వాహనానికి అనుమతి ఉంటుంది. వార్డు అభ్యర్థికి వాహనాలకు అనుమతి ఉండదు.
ఊపందుకున్న ప్రచారం
మొదట విడత నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రతిచోట 8 నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. కొందరు దగ్గరివారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ గుర్తులు లేకున్నా.. ఒక పార్టీ నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిని ఎలాగోలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అవకాశం వస్తుందో.. లేదోనన్న భావనలో చాలామంది సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో బుజ్జగింపులపర్వం ప్రారంభమైంది.
పకడ్బందీగా నిఘా
ఎన్నికల సమయంలో నగదు, మద్యం పంపిణీకి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు రూ.50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆపై తీసుకెళ్తే సీజ్ చేస్తారు. అవి ఎక్కడివో ఆధారాలు ఉంటే అనుమతి ఇస్తారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమవళి ప్రచారం చర్యలు తీసుకుంటామని, అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల: పోలింగ్ కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్‌లో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. కేంద్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నారు. 3,536 పోలింగ్ కేంద్రాలకు 110 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించామన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను అనుమతించాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే విధానంపై డెమో నిర్వహించారు. అనంతరం ర్యాండమైజేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరణ్, నోడల్ అధికారులు నరేశ్, రాము, రవికుమార్ పాల్గొన్నారు.
అటు నామినేషన్లు.. ఇటు పన్నుల వసూలు
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పన్నులు వసూలవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థులతోపాటు వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేందుకు వస్తున్న వారు పన్నులు చెల్లిస్తుండడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు పన్నులు వసూలయ్యాయని అధికారులు అంచనా వే స్తున్నారు. జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు, బలపర్చేవారు పన్నులు చెల్లించి రసీ దులను నామినేషన్ పత్రానికి జతచేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తున్నారు. పన్నుల చెల్లింపు కోసం నామినేషన్ సెంటర్ల వద్ద పంచాయతీ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
సీఎం, మంత్రులకు కోడ్ వర్తించదా..?
జగిత్యాల: సీఎం, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా అని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కోడ్ అమలులో ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పేరుతో జిల్లాలో పర్యటించడం కోడ్ ఉల్లంఘనే అన్నారు. ఆమె వెంట మాజీ కౌన్సిలర్ శీలం ప్రవీణ్, నాయక్ ఉన్నారు.
రాత్రి దాకా నామినేషన్ల స్వీకరణ
రాయికల్: రాయికల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 67, వార్డు సభ్యులకు 212 నామినేషన్లు వచ్చాయి. మైతాపూర్‌లో రాత్రి 8 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.
అనుమతి ఉంటేనే ప్రచారం
అనుమతి ఉంటేనే ప్రచారం
అనుమతి ఉంటేనే ప్రచారం
అనుమతి ఉంటేనే ప్రచారం


