భరోసా లేని వలస బతుకులు
కూలీల కష్టంతో రూ.కోట్లు గడిస్తున్న వ్యాపారులు పని ప్రదేశంలో కనీస వసతులు కరువు కనీస పరిహారం ఇవ్వని యాజమాన్యాలు పట్టించుకోని అధికార యంత్రాంగం
వెల్గటూర్: పొట్టకూటి కోసం ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి మన రాష్ట్రం వచ్చిన వలస కూలీల బతుకులకు భరోసా లేకుండా పోయింది. కూలీల చెమటను సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న యాజమాన్యాలు.. వారు ఉండేందుకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కష్టానికి తగిన వేతనం ఇవ్వడం పక్కనపెడితే.. పనిచేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తు గాయపడినా.. మృత్యువాత పడినా పరిహారం కూడా ఇవ్వడం లేదు. చదువు రాకనో.. భాషరాకనో.. చట్టాలపై అవగాహన లేకనో ఎంతోమంది కూలీలు వెట్టిచాకిరీ లోనే మగ్గిపోతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ఉమ్మడి వెల్గటూర్ మండల పరిధిలో చాలా వరకు క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 300 మంది వరకు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కూలీలు వలస వచ్చి పనిచేస్తున్నారు. వీరిని ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చి క్వారీలు, క్రషర్లలో పనికి కుదుర్చుతాడు. యాజమాన్యాల నుంచి ఎక్కువ మొత్తం తీసుకుని కూలీలకు మాత్రం అరకొర జీతాలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయిస్తాడు. పని చేసే ప్రదేశంలో వారి భద్రతకు సంబంధించిన పరికరాలు ఉండవు, నివాసానికి సరైన వసతులు కూడా కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. .
ప్రమాదాలు జరిగితే పరిహారం లేదు
వాస్తవానికి క్వారీలు, క్రషర్ల వంటి ప్రమాదకర ప్రాంతాల్లో 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న పిల్లల ను రానీయొద్దు. కానీ వెల్గటూర్ మండలంలో ఈ నిబంధన అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం యాజమాన్యాలు కార్మికుడి వయసు, నెల వేతనం ఆధారంగా రూ.పది లక్షలకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా బాధితులు కేసు నమోదు చేస్తే పరిహారం ఇస్తుంది. కానీ చట్టాలపై అవగాహన లేని కూలీలకు అవగాహనారాహిత్యంతో పరిహారం పూర్తిగా పరిహాసంగా మారింది.
బాల కార్మికులతో బలవంతంగా పని..
మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం. అయినా ఈ నిబంధన అమలు కావడం లేదు. గతంలో ఎండపల్లి మండలం మారేడ్‌పల్లిలో ఓ క్వారీలో బాల కార్మికుడితో జేసీబీతో గుట్టపై పని చేయించగా.. ప్రమాదవశాత్తు జేసీబీ కింద పడి మృతి చెందాడు. యాజమాన్యాల ఒత్తిడి మేరకు పోలీసులు సదరు బాలుడిని మేజర్ అని తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి క్వారీ యజమానిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా వత్తాసు పలికారు. బాలుడు మృతి చెందిన సందర్భంలో నిబంధనల ప్రకారం క్వారీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్వారీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మైనింగ్, లేబర్ శాఖల అధికారులు మామూలుగా చూసీచూడనట్లు వదిలేశారు. ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా బాలుడి కుటుంబానికి యాజమాన్యం ఎటువంటి పరిహారమూ ఇవ్వక పోగా.. కనీసం లేబర్ ఆఫీస్‌లో కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో బాధిత కుటుంబానికి సుమారు రూ.15లక్షల వరకు పరిహారం అందకుండా పోయింది.
చట్టం ఉల్లంఘిస్తే చర్యలు
2014 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం లేబర్ డిపార్ట్‌మెంట్‌లో నమోదైన వాటిని మాత్రమే తనిఖీ చేసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీలు, రైస్‌మిల్లులు మొదలైనవి లేబర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి రావు. ప్రత్యేకంగా ఏదైనా పిర్యాదులు వచ్చిన సందర్భంలో మాత్రమే వాటిని తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేంద్రకుమార్,
అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జగిత్యాల


