అనుకోని ప్రమాదం.. అపార నష్టం.. | - | Sakshi
Sakshi News home page

అనుకోని ప్రమాదం.. అపార నష్టం..

Dec 1 2025 9:28 AM | Updated on Dec 1 2025 9:28 AM

అనుకోని ప్రమాదం.. అపార నష్టం..

అనుకోని ప్రమాదం.. అపార నష్టం..

మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం ముత్యంపేటలోని దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో 30 దుకాణాలు బుగ్గిపాలు కాగా.. 36 కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారి సమీపంలోని హనుమాన్‌ విగ్రహం వద్దకు వెళ్లే దారిలో ఇరువైపులా బొమ్మల దుకాణాలుండగా.. శనివారం రాత్రి ఒక దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. 30 దుకాణాల్లోని సుమారు రూ.కోటికి పైగా విలువైన సామగ్రి, బంగారం, నగదు, సర్టిఫికెట్లను బుగ్గిపాలు చేశాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణాల్లో నిద్రిస్తున్న వారు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు.

కట్టుబట్టలే మిగిలాయి..

అప్రమత్తమైన స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నం చేసినా.. గాలి వీయడంతో మంటలు పక్క దుకాణాలకూ వ్యాపించాయి. దుకాణాల్లో నిద్రిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు.

రూ.2లక్షల నుంచి రూ.7లక్షల సామగ్రి

సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానుండడంతో దుకాణాదారులు ఒక్కొక్కరు సుమారు రూ.2లక్షల నుంచి రూ.7లక్షల వరకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. సమీపంలోని మరో మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించి.. పైపులు, విద్యుత్‌ తీగలు కాలడంతోపాటు ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. మంటల్లో కాలుతున్న దుకాణాల ఎదుట ఉన్న రెండు దుకాణాల బొమ్మలు కాలిపోయాయి. చికెన్‌ సెంటర్‌ ఎదుట జాలీలో ఉన్న సుమారు 18 కోళ్లు మృతిచెందాయి. ఫైరింజన్‌ సకాలంలో రాక భారీ నష్టం వాటిల్లింది.

దిగువ కొండగట్టులో షార్ట్‌ సర్క్యూట్‌

30 బొమ్మల దుకాణాలు బుగ్గి

36 కుటుంబాలు రోడ్డుపాలు

కాలి బూడిదైన బంగారం, నగదు, సర్టిఫికెట్లు, విలువైన సామగ్రి

సుమారు రూ.కోటికి పైగా నష్టం

సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న ఫైరింజన్‌

షార్ట్‌ సర్క్యూట్‌.. సకాలంలో ఫైరింజన్‌ రాకపోవడం.. గాలి వీయడం.. వెరసి నిరుపేదల జీవితాల్లో శనివారం కాళరాత్రిగా మిగిలిపోయింది. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొనుగోలు చేసిన రూ.లక్షలాది సామగ్రి, కుటుంబం కోసం దాచుకున్న బంగారం, నగదు, సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. కష్టార్జితం మంటల్లో కాలిపోయి కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు. నీడ కరువై.. ఉపాధి కోల్పోయి.. మంటల్లో బూడిదైన తమ దుకాణాలను చూస్తూ.. చేసిన అప్పులు తీర్చేదెలా దేవుడా అంటూ హృదయ విదారకంగా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement