పెత్తనం వాళ్లది.. ఇగ పోటీ ఎందుకు..?
జగిత్యాలజోన్: జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా గ్రామాభివృద్ధి సంఘాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. దీంతో సంబంధిత గ్రామాల్లో సర్పంచ్‌లుగా పోటీి చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతీ పనిలో గ్రామాభివృద్ధి సంఘాలు జోక్యం చేసుకోవడం గ్రామ సర్పంచ్‌లకు ఈసడింపుగా మారింది. గతంలో పలు విషయాల్లో గ్రామ సర్పంచ్‌లు, గ్రామాభివృద్ధి సంఘాల మధ్య విభేదాలు రావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గ్రామాభివృద్ధి సంఘంలో కులానికి ఒకరిద్దరు ప్రతినిధులుండడం.. వారు చెప్పిందే గ్రామంలో వేదంగా మారడంతో గ్రామ సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఒకానొక దశలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సవాల్ విసిరేవరకు గ్రామాభివృద్ధి సంఘాలు చేరాయంటే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో గ్రామంలో రూ.లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి.. ఇల్లిల్లూ తిరిగి సర్పంచ్‌గా గెలిచినా ఏం లాభం అన్న రీతిలో సర్పంచ్‌గా పోటీ చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామ పెత్తనమంతా గ్రామాభివృద్ధి సంఘాలే చేస్తుండడం పోటీ చేసే యువతకు అసలు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే గ్రామాభివృద్ధి సంఘాలను ఎదిరించే దీటైన నాయకుడు సర్పంచ్‌గా రావాలని చాలా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటుండడం విశేషం.


