సమయం లేదు మిత్రమా..!
ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం స్వీకరిస్తున్న రెండో విడత నామినేషన్లు తొలి విడత ప్రచారానికి వారం రోజులే సమయం అభ్యర్థుల్లో హడావుడి.. అన్నివర్గాల మద్దతు కోసం తాపత్రయం
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్‌లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి సరిగ్గా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండోది ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యాకనే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుంటారు. కానీ, ప్రచారానికి సరిగా వారం రోజుల సమయం ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో చోట సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఎవరు నిల్చోవాలి, ఎవరు వద్దన్నది చర్చించుకుంటున్నారు. బుజ్జగింపులకు సమయం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. రెబల్స్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రాజీ మార్గం కోసం తాపత్రయపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను బతిమిలాడుతున్నారు.
ఒక్క చాన్స్ ప్లీజ్
సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆశావహులు స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో పోటీ చేసే ఆశావహులు పార్టీల మద్దతు ఉంటే విజయ అవకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు సమయం లేకపోవడం, మరో వైపు ప్రజాప్రతినిధులు సైతం బలమైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రకటించిన అభ్యర్థులే కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎలాగైనా స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి అంశాలు సానుకూలంగా ఉంటాయనే ఆశావహులు ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు కోరుతున్నారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీపీలుగా చేసిన వారు సైతం ప్రస్తుతం సర్పంచ్ పదవికి ఉత్సాహం చూపుతున్నారు. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లు కలిసి వస్తాయో లేదో అనే ఉద్దేశంతో సర్పంచ్ పదవుల కోసం బరిలోకి దిగుతున్నారు.
జిల్లాలో సర్పంచ్, వార్డు పదవిని ఎలాగైన దక్కించుకోవాలని కొందరు ఏకగ్రీవం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, కుల సంఘాల నాయకులు పెద్ద మనుషుల సాయంతో ఎవరి ప్రయత్నం వారే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో కాసుగంటి లాస్యప్రియ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అలాగే, మిగతా స్థానాల్లో సైతం చాలా తక్కువ మంది పోటీలో ఉండేలా బుజ్జగింపులు, ఏకగ్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు.
సమయం లేదు మిత్రమా..!


