మున్సిపల్ అక్రమాలపై విచారణ జరిపించాలి
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ పటణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. పట్టణంలో అక్రమ నిర్మాణదారులతోపాటు అనుమతులు పొంది.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టని వారిని బెదిరింపులకు గురిచేస్తూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. రెవెన్యూ విభాగంలో ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పన్ను విధింపు, పేరు మార్పిడి వంటి పనులకు లంచాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. శానిటేషన్ విభాగంలో ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, వాహనాలకు మరమ్మతు, డీజిల్ వినియోగం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. ఔట్‌సోర్సింగ్ విభాగంలో అవినీతికి పాల్పడిన కొందరిని తొలగించిన అధికారులు.. వారిని తిరిగి తీసుకోవడమే కాకుండా కీలక సెక్షన్లల్లో విధులు అప్పగించారని, పలువురు ఏళ్ల తరబడిగా ఒకే విభాగంలో కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. వీటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సుంకేట విజయ్, ఉపాధ్యక్షులు బొడ్ల నగేశ్, తల్లొజి భాస్కర్ ఉన్నారు.


