రామగుండమా..! ఊపిరి పీల్చుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రామగుండం.. అంటే ఇంతకాలం ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి గనులు, బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఓపెన్‌కాస్ట్‌లు ప్రపంచానికి తెలిసింది ఇంతే! కొంతకాలంగా పెరుగుతున్న కేన్సర్ కేసులకు రామగుండం పారిశ్రామిక పాంతం నిలయంగా మారుతోందన్న విషయం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రామగుండం ప్రాంతంలోని దాదాపు 10 గ్రామాల్లో ప్రజలకు వైద్యశిబిరాల ద్వారా ప్రభుత్వ సహకారంతో రక్తనమూనాలు సేకరించారు. ఇందులో దాదాపు 183 మందికి ప్రీకేన్సర్ లక్షణాలు కనిపించగా 30 మంది వరకు కేన్సర్ అనుమానిత కేసులు ఉన్నాయన్న ప్రచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో వాయుకాలుష్యం పెరిగిన మాట వాస్తవమే. ఫలితంగా వాయునాణ్యత రోజురోజుకు దిగజారిపోతుంది. సాధారణంగా వాయు నాణ్యత 5 ఏక్యూఐ యూనిట్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం సగటున రామగుండం పరిసరాల్లో 180 నుంచి 1,200 వరకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) యూనిట్లను తాకుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
దాదాపు ఐదు దశాబ్దాలుగా రామగుండంలో వాయుకాలుష్యం సాధారణ విషయమే. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, దాని ఆధారిత ఎన్టీపీసీ ప్రాజెక్టులు, వాటి నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్‌లైయాస్, ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగులు, సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల గాలిలోకి రోజుకు టన్నుల కొద్దీ కార్బన్‌యాకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, సల్ఫర్ తదితర విషవాయువులు వెలువడుతున్నాయి. వీటికితోడు ఇక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పలు కొత్త పవర్ ప్రాజెక్టులు, ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్ పునఃప్రారంభంతో గాలిలోకి కార్బన్‌మోనాకై ్సడ్, అమోనియా లీకేజీలు పెరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రాత్రిపూట అమోనియా లీకై న సందర్భంలో పరిసరాల్లోని గోదావరిఖని, వీర్లపల్లి, ఎలకలపల్లి, ఎన్టీపీసీ, గౌతమినగర్ తదితర 10 గ్రామాల్లో ప్రజలకు ఊపిరి ఆడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక వాతావరణంలోకి విడుదలవుతున్న వ్యర్థాల విషయంలో పీసీబీ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నా.. పెద్దగా స్పందించిన దాఖలాలు కానరావడం లేదు.
ఎక్కడెక్కడ రక్తపరీక్షలు నిర్వహించారు?
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో, రోహిణి ఫౌండేషన్, ఎన్టీపీసీ రామగుండం, స్థానిక పోలీసుల సహకారంతో రామగుండం ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో నోటి కేన్సర్ పరీక్షా శిబిరాలు నిర్వహించారు. శిబిరాల్లో మొత్తం 5,000 మందిని పరీక్షించగా, 183 మందిలో ప్రీకేన్సర్ లక్షణాలు, అలాగే 20 మందిలో కేన్సర్ అనుమానిత కేసులను గుర్తించారు. రోజురోజుకు పెరుగుతున్న వాయు, నీరు, నేల కాలుష్యాల కారణంగా ప్రభావితమవుతున్న ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు రామగుండం మండలం కుందన్‌పల్లి, మల్యాలపల్లి, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపూర్, విఠల్‌నగర్, ఎల్‌కపల్లి, అంతర్గాం, నరసలపల్లి పరిసర గ్రామాల్లో నివసిస్తున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షల ఫలితాల అనంతరం అనుమానిత కేసులను తదుపరి పరీక్షలు, చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డెంటల్ ఓపీకి పంపించారు.
ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం తీవ్రత
జీవించడానికి వీలు లేకుండా వాయు నాణ్యత
170–1,200 యూనిట్లు తాకుతున్న ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్
పెరుగుతున్న కేన్సర్ కేసులతో ఆందోళనలో ప్రజలు
రామగుండంలో 10 గ్రామాల్లో 5,000 మందికి రక్త పరీక్షలు
183 మందికి ప్రీక్యాన్సర్ లక్షణాలు గుర్తించిన రోహిణీ ఎన్జీవో


